మెగా కుటుంబ సభ్యురాలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన నూతన క్రీడా పాలసీలో భాగంగా, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు “బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్”ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉపాసనను కో ఛైర్మన్‌గా నియమించడం గమనార్హం. ఈ బోర్డులో ఐపీఎల్ లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా చైర్మన్‌గా ఉన్నారు.
ఈ బోర్డులో కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, అభినవ్ బింద్రా, భూటియా, కావ్య మారన్, రవికాంత్ రెడ్డి తదితర ప్రముఖ క్రీడా రంగ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ బోర్డులో భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు నాణ్యమైన వేదికలు, శిక్షణ, అవకాశాలు లభించేందుకు ఉపసన ప్రధాన పాత్ర పోషించనున్నారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదగాలన్న లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించబడినట్టు ముఖ్యమంత్రి ఇప్పటికే తెలిపారు.