- రాజమణి విషాదాంతం.. గల్ఫ్ బాటలో ఏజెంట్ల మోసం.. ఒక గుణపాఠం!
- మార్చురీలో 72 రోజులు.. ఒక కుమార్తె పోరాటం..
విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే అనేక మంది జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లను మరోసారి గుర్తుచేసేలా మురళ రాజమణి సంఘటనగా నిలిచింది. ఒమన్‌లో అనారోగ్యంతో మరణించిన రాజమణి మృతదేహం దాదాపు 72 రోజుల పాటు మస్కట్ దేశంలోని హాస్పిటల్ మార్చురీ లోనే ఉండగా (72 days to Shifting indian lady dead body from oman), చివరకు NRI TDP ఒమాన్ మరియు సంబంధిత అధికారుల సమన్వయంతో ఫిబ్రవరి 14న భారతదేశానికి అనగా నేడు చేరుకోనుంది.
అసలు కథలోకి వెళ్తే చిత్తవరంకు చెందిన మురళ రాజమణి డొమెస్టిక్ వర్కర్ గా పనిచేసేందుకు ఏజెంట్ ద్వారా విజిట్ వీసాపై ఒమన్‌కు వెళ్ళడం జరిగింది. ఎయిర్ పోర్ట్ నుండి ఏజెంట్ ఓమాని ఇంటికి తీసుకొని వెళ్లారు. వారం రోజుల్లోనే రాజమణి అస్వస్థతకు గురవ్వడంతో ఆ ఏజెంట్ ఆమెను ఎటువంటి జాలి చూపకుండా ఎయిర్ పోర్టు లో వదిలి వెళ్ళిపోయాడు. ఎయిర్ పోర్టు లో ఆమె పరిస్థితి గమనించిన కొందరు ప్రయాణికులు ఆమెను ఆసుపత్రి లో చేర్పించారు.
డిసెంబర్ 4, 2025న మస్కట్‌లోని ఒక ఆసుపత్రిలో అనారోగ్యంతో ఆమె మరణించారు. అదే రోజు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆమె వద్ద వీసా మరియు పాస్పోర్ట్ లేకపోవడంతో ఆమెను గుర్తించడం ఆలస్యమైంది. కానీ విజిట్ వీసాపై వెళ్లడం వల్ల అక్కడ ఎలాంటి అధికారిక స్పాన్సర్ లేకపోవడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపే ప్రక్రియ కూడా ఆలస్యమైంది. దీంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
ఇండియా లో ఉండి, పెదపేట కు చెందిన బింకం విమల అనే ఏజెంట్ ద్వారా రాజమణి ఒమాన్ వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలియ చేయగా, ఒమాన్ లో నజీర్ ఎంటర్ప్రైసెస్ కు చెందిన నజీర్ బాషా ను ఒమాన్ ఏజెంట్ గా గుర్తించడం జరిగింది.
భారతదేశంలో ఉన్న ఆమె కుమార్తె ఉషా రాణి వెంటనే మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని NRI-TDP సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి APNRTS తో పాటు ఒమన్ NRI TDP సభ్యులు సహకారంతో భారత రాయబార కార్యాలయాన్ని సహాయం కోరడం జరిగింది. ఇదే సమయంలో, రాజమణిని విజిట్ వీసాపై ఒమన్‌కు పంపిన ట్రావెల్ ఏజెంట్‌పై ఆమె కుటుంబం పోలీసు ఫిర్యాదు కూడా చేసింది. మొదట మృతదేహాన్ని తీసుకురావడానికి ఏజెంట్ హామీ ఇచ్చినప్పటికీ, రెండు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కుటుంబం మరింత ఇబ్బందులు ఎదుర్కొంది. పైగా కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు కుటుంబం ఆరోపించింది.
రాజమణి విసిట్ వీసాపై వెళ్లినందువల్ల ఆమె మృతదేహాన్ని తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ఎలాంటి ఆర్ధిక సహాయం చేయలేమని తేల్చి చెప్పింది. ఆ సమయంలో NRI TDP ఒమాన్ సభ్యులు నాగరాజు, M రాజేష్, R శ్రీనివాస్, శ్రీధర్ ఎంబసీ ని సంప్రదించి ఆ ఏజెంట్ పై కేసు పెట్టి రాజమణి లా మరొకరు బలవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆ ఏజెంట్ ను బ్లాక్ లిస్ట్ చేయాలని కోరగా భారత రాయబార కార్యాలయం అందుకు సానుకూలంగా స్పందించింది. అలాగే రాజమణి మృతదేహాన్ని తరలించేందుకు ఎన్నారై TDP ఒమన్ సభ్యులు అందరూ కలిసి 900 ఒమాన్ రియాల్ (దాదాపు ₹2,15,000) సమకూర్చడం జరిగింది.
ఈ పరిస్థితుల్లో NRI-TDP సెల్, NRI-TDP (ఒమన్), APNRTS మరియు భారత రాయబార కార్యాలయం సమన్వయంతో అవసరమైన అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ సహకారంతో రాజమణి మృతదేహం నేడు అనగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌కు చేరుకోనుంది.
ఈ ఘటన మరో ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లేటప్పుడు సరైన విధానాలు, చట్టబద్ధమైన వీసాలు మరియు అధికారిక అనుమతులు ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా చూపిస్తుంది.
రాజమణి మృతదేహాన్ని తరలించేందుకు ఎంతో కృషి చేసిన NRI TDP ఒమాన్ టీం కు NRI మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ మరియు APNRTS ప్రెసిడెంట్ రవి వేమూరి అభినందనలు తెలిపారు, అలాగే ఏజెంట్ ల చేతిలో మోసపోవద్దని, విజిట్ వీసాపై వెళ్లడం వల్ల ఉద్యోగ భద్రత మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందడం కూడా కష్టమవుతుందని హెచ్చరించారు.
ఇలాంటి ఏజెంట్ లు ఊరికి ఒకరు ఉన్నారని, వారి మాటలు నమ్మి విసిట్ విశాలపై గల్ఫ్ దేశాలకు వెళ్ళి రాజమణి లా అవ్వవద్దని NRI TDP సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ తెలిపారు. ఎంబసీ ద్వారా నమోదు చేసుకోవడం, సరైన ఉద్యోగ ఒప్పందాలతో వెళ్లడం వల్ల విదేశాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వం మరియు రాయబార కార్యాలయం నుంచి వేగంగా సహాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవలే అనంతపురం కు చెందిన ఒక మహిళ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుందని గుర్తుచేసుకున్నారు. (link: https://www.andhrapravasi.com/apnrt/nri-tdp-rescue-of-anantapur-woman-stranded-in-oman-31075)
మురళ రాజమణి మృతదేహాన్ని తిరిగి తీసుకురావడంలో సహకరించిన భారత రాయబార కార్యాలయం, APNRTS, NRI-TDP సెల్ మరియు NRI-TDP (ఒమన్) సంస్థలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో పేదలను విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు పంపుతున్న ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ వారిని కోరారు. ఈ సంఘటన విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరికగా నిలుస్తోంది — చట్టబద్ధమైన మార్గంలో, అధికారిక ప్రక్రియల ద్వారా వెళ్లడం మాత్రమే భద్రమైన మార్గం.