ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాలకు మాత్రమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రకాశం జిల్లా కొండపి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మరోటి తూర్పు గోదావరి జిల్లాలోని కడియపులంక పంచాయతీకి చెందినది.
కొండపిలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం, జూలై 30 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 10న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు తదితర సామగ్రి సిద్ధం చేయాలన్నారు.
ఇదే విధంగా కడియం మండలం కడియపులంక పంచాయతీ సర్పంచ్ స్థానానికి కూడా ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ జూలై 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నారు.
ఇక ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మంగమూరు పంచాయతీకి ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కారణంగా అక్కడ ఎన్నికలు వాయిదా వేశారు. పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
పంచాయతీలతో పాటు, కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లె, నెల్లూరు జిల్లా విడవలూరు, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని మనేంద్రం ఎంపీటీసీ స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించనున్నారు.