ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు బుధవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. విజయవాడ-నెల్లూరు మార్గంలో వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేసిన పోలీసులు, అనుమానాస్పదంగా కనిపించిన ఒక బ్యాగును పరిశీలించారు. అందులో మొత్తం రూ.49.45 లక్షలు ఉన్నట్లు గుర్తించారు.
పోలీసులు వెంటనే నగదును స్వాధీనం చేసుకుని, బస్సులో ప్రయాణిస్తున్న తాడేపల్లిగూడెం వాసి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. అతనిని పోలీసులు కఠినంగా ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బు మూలం ఏమిటి? ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎవరికీ ఇవ్వాల్సిందో అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ నగదు ఎన్నికలకు సంబంధించి ఉపయోగించబడే అవకాశముందని అనుమానిస్తున్నారు. తగిన పత్రాలు చూపించలేకపోవడంతో నగదును సీజ్ చేశామని తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.