అవినాష్‌రెడ్డి అరెస్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఇవే…
రిమాండ్ రిపోర్టులో దిమ్మతిరిగే నిజాలు…
మద్యం మత్తులో అవినీతి తిమింగలాలు…
LiquorScam: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన పాత్రధారిగా భావిస్తున్న ముప్పిడి అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అవినాష్‌రెడ్డి సాగించిన అక్రమాల చిట్టాను ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ఏ-1 నిందితుడు కేసీరెడ్డితో కలిసి వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్లు అధికారులు గుర్తించారు.
మద్యం నడిపించడంలో అవినాష్‌రెడ్డి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారని రిపోర్టు పేర్కొంది. కేవలం ప్లాన్ చేయడమే కాకుండా, ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరిగినట్లు తేలింది. మద్యం వ్యాపారుల నుంచి కిక్‌బ్యాక్‌లు, కమీషన్ల రూపంలో భారీగా లబ్ధి పొందారని, ఈ నేరపూరిత సొమ్మును ఇతర ప్రాంతాలకు మళ్లించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఐపీసీ సెక్షన్లు 409, 420, 384తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు.
మద్యం మార్కెట్లో ఆధిపత్యం కోసం అవినాష్‌రెడ్డి వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. ప్రజలకు అలవాటైన పాత, పాపులర్ బ్రాండ్లను కావాలనే మార్కెట్ నుంచి మాయం చేసి, కేవలం తమకు ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు మాత్రమే 'ఆర్డర్ ఫర్ సప్లై' దక్కేలా చక్రం తిప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలను సైతం తన గుప్పిట్లోకి తెచ్చుకుని, సిండికేట్ చెప్పినట్లే వ్యాపారం జరిగేలా ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలు లభించాయి.
అక్రమాలకు అడ్డురాకూడదనే ఉద్దేశంతో, అప్పటి వరకు పారదర్శకంగా ఉన్న 'ఆటోమేటెడ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్'ను అవినాష్‌రెడ్డి రద్దు చేయించినట్లు అధికారులు తెలిపారు. దాని స్థానంలో కావాలనే 'మాన్యువల్ ప్రాసెస్'ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎవరికి ఆర్డర్లు ఇవ్వాలి, ఎంత కోటా కేటాయించాలి అనే అంశాల్లో మానిప్యులేషన్లకు అవకాశం ఏర్పడింది. ఈ లొసుగులను వాడుకుని డిస్టిలరీల నుంచి సుమారు 3,500 కోట్ల రూపాయలను కిక్‌బ్యాక్‌ల రూపంలో వసూలు చేసినట్లు రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.