ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ రైతులకు ఈ దసరా పండగ ముందు నుంచే పండగ వాతావరణం నెలకొంది. కొబ్బరికాయల ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. సాధారణంగా మార్కెట్లో వెయ్యి పచ్చి కొబ్బరికాయల ధర రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండేది. అయితే ఈసారి డిమాండ్ పెరగడంతో ఏకంగా రూ.26 వేల వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో సైజు, క్వాలిటీ బట్టి ఈ ధర దాటి కూడా పలుకుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ చరిత్రలో ఇంత పెద్ద ధరలు ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు, రైతులు ఒకే సురలో అంటున్నారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలు కొబ్బరి ఉత్పత్తికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. ఇక్కడి రైతులతో పాటు అనేకమంది కార్మికులు, వ్యాపారులు, పరిశ్రమలు కొబ్బరి ఆధారంగా ఉపాధి పొందుతున్నారు. గతంలో ఒక్కో కాయ ధర రూ.2 నుంచి రూ.5 వరకు మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో రూ.5 కంటే ఎక్కువ పలికితే పెద్ద లాభం అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కాయలకు మంచి డిమాండ్ రావడంతో ప్రస్తుతం రైతులు రూ.15 నుంచి రూ.20 వరకు నేరుగా సంపాదిస్తున్నారు. దీనివల్ల కొబ్బరి వ్యాపారం కూడా సుమారు 30 శాతం పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
దసరా పండగ దగ్గర పడుతుండటమే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, పంజాబ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు లారీ లారీలుగా కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఏపీ రైతులు కేరళ, తమిళనాడు, కర్ణాటక రైతులతో పోటీగా నిలుస్తున్నారు. అంతేకాకుండా, కోనసీమ ప్రాంతంలో ప్రతి ఇంటికి కొబ్బరి చెట్లు ఉండటం వలన రైతులు నెలకు జీతంలా డబ్బులు సంపాదిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
కొబ్బరికాయలతో పాటు ఆకులు, కాండం, డొక్కలతో అనేక ఉత్పత్తులు తయారవుతున్నాయి. కొబ్బరి పాలు, జ్యూస్, కొబ్బరి నూనె, పీచు, తాళ్లు, అలాగే నూనె పరిశ్రమలు కూడా ఇక్కడే పుష్కలంగా ఉన్నాయి. రైతులు కొబ్బరికాయలను నేరుగా మార్కెట్లో విక్రయించి లాభాలు పొందుతున్నారు. ఈ పరిస్థితి వల్ల కోనసీమ రైతులకు ఆర్థికంగా బలపడటమే కాకుండా, కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు కూడా కొత్త ఊపిరి లభిస్తోంది. ఈ దసరా సీజన్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.