Varla Ramaiah: జగన్ గారూ.. బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకోండి, మీ తప్పుడు ఆలోచనలకు స్వస్తి చెప్పండి!

Varla Ramaiah: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కొనియాడారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Published : 2026-03-31 20:12:00
  • పార్లమెంటులో బిల్లు పాస్ అయితే ఇక అమరావతిని టచ్ చేసే ధైర్యం ఎవరికీ ఉండదు: వర్ల రామయ్య హెచ్చరిక..
     
  • Politics: పునర్విభజన చట్టం ప్రకారం 'ఒక్కటే రాజధాని': సెక్షన్ 5 లో ఉన్న క్లారిటీని జగన్ ఎందుకు విస్మరించారు?

Varla Ramaiah: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కొనియాడారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, అమరావతిని ఏదో ఆషామాషీగా రాజధానిగా ప్రకటించలేదు. ఎంతో మంది మేధావులు, నిష్ణాతులు, చరిత్రకారులు, రచయితల అభిప్రాయాలను సేకరించి, అందరి ఆమోదంతోనే ఈ పవిత్ర భూమిని రాజధానిగా ఎంపిక చేశాం. కానీ, 2019లో వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే ఎందుకు అంత ద్వేషమో అర్థం కాదు. అక్కడ ఉన్న రైతులంటే పడదా? లేక ఆ పేరు అంటే పడదా? కారణం ఏదైనా, 'మూడు రాజధానులు' అనే తుగ్లక్ నిర్ణయంతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని విమర్శించారు. 

ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటి అని భారతదేశం మొత్తం ఫక్కున నవ్వింది. 'ఎవరయ్యా ఈ ముఖ్యమంత్రి? ఎక్కడైనా ఇలాంటి విడ్డూరం ఉంటుందా?' అని దేశమంతా ఉలిక్కిపడింది. అసలు రాజ్యాంగం మీద, చట్టాల మీద జగన్ గారికి ఏమాత్రం అవగాహన ఉంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ (పునర్విభజన చట్టం)లో 'క్యాపిటల్'అని స్పష్టంగా ఉంది. అంటే ఒక రాజధాని అని అర్థం. దాన్ని పట్టుకుని విపరీతార్థాలు తీస్తూ కాలయాపన చేశారు. మొన్న 28వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక అద్భుతమైన తీర్మానం చేసింది. 'అమరావతియే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని' అని చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. ఇకపై ఎవరూ కూడా, ఏ శక్తులు కూడా రాజధానిని కదిలించే సాహసం చేయలేవు. ఇతర రాష్ట్రాలకు ఎలాగైతే పర్మనెంట్ రాజధాని ఉందో, మన రాష్ట్రానికి కూడా అమరావతి అలాగే ఉంటుంది. 

శాసనసభలో ఈ కీలక చర్చ జరుగుతుంటే, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? సభకు వచ్చి తన అభిప్రాయం చెప్పడానికి ఆయనకు భయమా? లేక తాను చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నారా? బయట ఉండి మాత్రం రాళ్లు వేయించడం, తాటాకు చప్పుళ్లు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఆయన పార్టీ నేతలు ధర్మాన, బొత్స లాంటి వారు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు. కర్నూలు, హైదరాబాద్ రాజధానులు మార్పు వీటి నేపథ్యాలు వేరు. భాషా ప్రయుక్త రాష్ట్రాల తర్వాత పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు అమరావతిని మార్చే హక్కు ఎవరికీ లేదు. అమరావతి అనేది ప్రజాభిప్రాయం. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆస్తి. శాసనసభ తీర్మానంతో దీనికి తిరుగులేని చట్టబద్ధత వచ్చింది. దీన్ని పార్లమెంటుకు కూడా పంపడం జరిగింది. ఇకపై ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. అమరావతి వెలుగులను ఆపడం ఎవరితరం కాదన్నారు.

జగన్ మోహన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను.. అమరావతి విషయంలో మీ పార్టీ 'స్టాండ్' ఏంటి? 2014లో అసెంబ్లీ సాక్షిగా 'అమరావతికి 30 వేల ఎకరాలు ఉండాలి' అని మద్దతు పలికింది మీరు కాదా? మరి 2019లో అధికారంలోకి రాగానే ఆ మాట ఎందుకు మార్చారు? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, ఇంతవరకు అమరావతిపై మీ పార్టీ ఖచ్చితమైన విధానం ఏంటో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారు? రాజధాని విషయంలో ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక, అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు కదా? 'రాజధాని అంటే 30 వేల ఎకరాల పైన ఉండాలి' అని ఆరోజు పెద్ద పెద్ద మాటలు చెప్పింది మీరు కాదా? మరి ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారు? అసలు మీకు అమరావతి అంటే ఎందుకు అంత కంటగింపు? అక్కడ ఉన్న పేద రైతులంటే నచ్చలేదా? లేక అమరావతిలో ఏదైనా నిర్దిష్టమైన కులం ఉందనే మీ అపోహ మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదా?" మీ పార్టీలోని బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు గారు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. 

వారికి తోడు కొంతమంది కుహనా మేధావులు వచ్చి రాజ్యాంగ సవరణ అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఇది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ (పునర్విభజన చట్టం) 2014 ప్రకారం ఆ చట్టంలోని సెక్షన్ 5 లో 'దేర్ షల్ బి ఏ క్యాపిటల్' అని చాలా స్పష్టంగా ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు కుప్పిగంతులు వేయడానికి ఇది మీ ఇంటి వ్యవహారం కాదు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాం. త్వరలోనే పార్లమెంటులో దీనిపై బిల్లు పాస్ అవుతుంది. ఒక్కసారి పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యి, రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత.. ఇక దాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఆ తర్వాత జగన్ గారు వచ్చినా, బొత్స గారు వచ్చినా, మీ భజన బృందం వచ్చినా ఒక్క ఇటుకను కూడా కదపలేరు. అమరావతికి ఇక తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రజల్ని పక్కదారి పట్టించడం మానుకోండి. మీరు ఎలాగూ బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు, అలాగే ఉండండి. మీతో పాటు మీ నోటికి, మీ తప్పుడు ఆలోచనలకు కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వండి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అమరావతి ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల నిశ్చయం. 

జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర భజన చేసే కొంతమంది మేధావులు ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ జరగాలని మాట్లాడుతున్నారు. అసలు మీకు రాజ్యాంగం మీద కనీస అవగాహన ఉందా? ఆర్టికల్ 368 ఎప్పుడు వస్తుంది? ఉన్న రాజధానిని మార్చాలన్నప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ అమరావతి అనేది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ (పునర్విభజన చట్టం) ప్రకారం ఏర్పడుతున్న పర్మనెంట్ క్యాపిటల్. దీనికి ఆర్టికల్ 368తో సంబంధం లేదు. మీ మిడిమిడి జ్ఞానంతో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించాలని చూడకండి. జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, తలకిందులుగా తపస్సు చేసినా అమరావతిని ఆపడం మీ వల్ల కాదు. బొత్స సత్యనారాయణ గారు తన గొంతు చించుకుని అరిచినా, ధర్మాన ప్రసాదరావు గారు ఆ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎన్ని పెడర్థాలు తీసినా.. అమరావతి పురోగతిని అడ్డుకోవడం మీ శక్తికి మించిన పని. అమరావతి అంటే నాడు దేవతల రాజధాని, నేడు ఐదు కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని. అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది, రేపు పార్లమెంటులో బిల్లు పాస్ అవుతుంది. ఒక్కసారి రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాత.. ఇక ఎవడబ్బ సొత్తని అమరావతిని కదిలిస్తారు? ఇకపై అమరావతిని టచ్ చేసే ధైర్యం ఎవరికీ ఉండదు. 

జగన్ తాబేదారులు, భజనపరులు ఇప్పటికైనా ఈ అమరావతి జోలికి రావడం మానుకుంటే మీకు మంచిది. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మార్చేస్తాం అని ఎవరో మాట్లాడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చేదీ లేదు, చచ్చేదీ లేదు.. రాజధానిని మార్చేదీ లేదు. ఆ పగటి కలల నుంచి బయటకు రండి. బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న జగన్ గారు, ఇప్పటికైనా ఈ తప్పుడు మాటలు కట్టిపెట్టి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవించడం నేర్చుకోండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు ఒక రాజకీయ పార్టీయేనా? మీకు ఒక సిద్ధాంతం అంటూ ఉందా? మాయ మాటలు చెప్పి, అసాధ్యమైన వాగ్దానాలు చేసి, అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు తప్ప.. ప్రజల్లోకి ఒక ఐడియాలజీని తీసుకెళ్లి గెలిచిన పార్టీ మీది కాదు. అందుకే ఈరోజు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నారు. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి గారు.. అమరావతి మీద మీ పార్టీ విధానం ఏంటో ఇప్పటికైనా స్పష్టం చేశారా? మీ విధానాన్ని కనీసం రాష్ట్రపతికైనా నివేదించారా? ఏమీ లేని మీరు రాజధాని గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అసెంబ్లీకి రావాల్సింది. 

అక్కడ మీ వాదన వినిపించాల్సింది. కానీ అసెంబ్లీ అంటే మీకు భయం, వణకు! లోపలికి రావడానికి ధైర్యం లేక, బయట కూర్చుని మీ తాబేదారులతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు రాలేని మీరు రాజధాని గురించి విమర్శలు చేయడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నాను.. ఒక్క రోజు ఓపిక పట్టండి. రేపు పార్లమెంటులో అమరావతి రాజధానిగా బిల్లు ఆమోదం పొందుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, ఇది తథ్యం దేవతలు కూడా 'తథాస్తు' అని దీవిస్తున్నారు. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు.. ఇది మీ దింపుడు కళ్లం ఆశ మాత్రమే. మీ కుట్రలు, కుతంత్రాలు అమరావతి వెలుగును ఆపలేవు. జగన్ గారు, నోటికి వచ్చినట్టు మాట్లాడటం కట్టిపెట్టండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని. ఇది సత్యం, ఇది నిత్యం, ఇది ధర్మం మీ తప్పుడు ఆలోచనలకు ఇకనైనా స్వస్తి పలకండి. అమరావతి కదల్చలేనంత పటిష్టంగా, శాశ్వత రాజధానిగా వెలుగొందబోతోంది.

Spotlight

Read More →