Housing Scheme: పేదల 'సొంతింటి' కల సాకారం... రేపే 2.5 లక్షల గృహ ప్రవేశాలు!

Housing Scheme: ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ గృహ పంపిణీ కార్యక్రమం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపనుంది. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీలను అభివృద్ధి చేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ పంపిణీ ముఖ్య ఉద్దేశం.

Published : 2026-03-29 19:17:00

పేదల గృహ స్వప్నం సాకారం.. సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు పంపిణీ…

21 నెలలు - 5.50 లక్షల ఇళ్లు: రికార్డు సృష్టించిన కూటమి ప్రభుత్వం…

ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా గృహ ప్రవేశాల సందడి…

 Housing Scheme: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో విడత సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా రేపు (సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిర్వహించే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని, లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించనున్నారు.

గత 21 నెలల కాలంలో ప్రభుత్వం గృహ నిర్మాణ రంగంలో రికార్డు స్థాయి పురోగతిని సాధించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సుమారు 5.50 లక్షల మంది పేదలకు ఇళ్లను అందజేయడం విశేషం. గతేడాది నవంబర్‌లో రాయచోటి వేదికగా మొదటి విడతలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా, ఇప్పుడు రెండో విడతలో భాగంగా 1 లక్ష టిడ్కో (TIDCO) ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల సాధారణ ఇళ్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం.. సోమవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుండి బయలుదేరి, 11:50 గంటలకు నాయుడుపేట మండలం పుదూరు చేరుకుంటారు. అక్కడ టిడ్కో గృహాల లబ్ధిదారులతో గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, వారితో ముచ్చటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:40 గంటలకు ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక' బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్థానిక నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు.

సాయంత్రం వేళ తిరుపతిలో మరో కీలక కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 (P4) కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో వార్షికోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పీ4 పథకం ద్వారా లబ్ధి పొందిన వివరాలను, భవిష్యత్తు కార్యాచరణను ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాత్రి 8:50 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ గృహ పంపిణీ కార్యక్రమం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపనుంది. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీలను అభివృద్ధి చేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ పంపిణీ ముఖ్య ఉద్దేశం. ఈ సామూహిక గృహ ప్రవేశాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరగనున్నాయి.

Spotlight

Read More →