తేనె ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ ప్రపంచస్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశం నుంచి ఎగుమతులు అనూహ్యంగా పెరిగి, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తేనె ఎగుమతిదారుగా ఎదిగింది. 2020లో 9వ స్థానంలో ఉన్న భారత్ కేవలం మూడు సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైన స్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం, 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 1.07 లక్షల మెట్రిక్ టన్నుల సహజ తేనెను ఎగుమతి చేశారు. ఈ ఎగుమతుల విలువ 177.55 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 1,480 కోట్లకు సమానం.
ఈ విజయానికి వెనుక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘తీపి విప్లవం’ (Sweet Revolution) ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ విప్లవం లక్ష్యం దేశవ్యాప్తంగా తేనెటీగల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో ప్రోత్సహించడం, నాణ్యమైన తేనె ఉత్పత్తిని పెంచడమే. ‘నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్’ (NBHM) అనే పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం, శిక్షణ, పరికరాలు అందిస్తోంది. 2020–21 నుంచి 2022–23 వరకు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం అమలు చేయగా, దాని ఫలితాలు అద్భుతంగా రావడంతో మరో రూ. 370 కోట్లతో ఈ ప్రాజెక్టును 2025–26 వరకు పొడిగించారు.
తేనెటీగల పెంపకం కేవలం తేనె ఉత్పత్తికే పరిమితం కాదు. ఇది రైతుల జీవనోపాధిలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. పంట పొలాల్లో పరాగసంపర్కం (Pollination) ప్రక్రియలో తేనెటీగల పాత్ర కీలకం. అవి పంటల దిగుబడిని గణనీయంగా పెంచుతాయి. తేనెతో పాటు బీ వాక్స్, రాయల్ జెల్లీ, బీ పోలెన్, ప్రోపోలిస్ వంటి ఉత్పత్తులు గ్రామీణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారాయి. ఇవి దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడమే కాకుండా, మహిళలు, చిన్న రైతులు, భూమిలేని కార్మికులకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి.
ఈ పథకాన్ని ప్రభుత్వం మూడు దశల్లో అమలు చేస్తోంది. మొదటిది – శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకం ద్వారా పంటల ఉత్పాదకతను పెంచడం. రెండవది – తేనె సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మౌలిక వసతులను బలోపేతం చేయడం. మూడవది – వివిధ ప్రాంతాల వాతావరణానికి తగిన పరిశోధన, సాంకేతికత అభివృద్ధి. తేనె నాణ్యతను, దాని మూలాన్ని గుర్తించేందుకు ‘మధుక్రాంతి’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తేనెటీగల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉన్నందున, భవిష్యత్తులో భారత్ ఈ రంగంలో ప్రపంచ అగ్రస్థానాన్ని అందుకుంటుందనే నమ్మకం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.