శ్రీహరికోట నుండి నేడు మరో సాంకేతిక ఘట్టానికి నాంది పలకనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని నేడు సాయంత్రం 5:40 గంటలకు GSLV-F16 రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
ప్రపంచంలోనే తొలి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్ టెక్నాలజీతో రూపొందించిన నిసార్ ఉపగ్రహం… భూమిపై పగలు, రాత్రి, వర్షం, మంచు వంటి ఎలాంటి వాతావరణంలోనైనా అధిక స్పష్టతతో ఫొటోలు తీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహం ద్వారా భూకంపాలు, వరదలు, సునామీలు, కొండచరియలు, అగ్నిపర్వతాల పేలుళ్లను ముందే గుర్తించవచ్చు. విపత్తుల నిర్వహణలో ఇది కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ శాటిలైట్ భూమిని ప్రతి 12 రోజులకు ఒకసారి పూర్తిగా స్కాన్ చేస్తూ ప్రభుత్వాలకు, శాస్త్రవేత్తలకు ఉచిత సేవలు అందించనుంది. దాని బరువు 2,393 కిలోలు. భూమికి 743 కిలోమీటర్ల దూరంలో ఉన్న లియో ఆర్బిట్‌లో స్థిరపడుతుంది. ఇందులో నాసా అభివృద్ధి చేసిన L-బ్యాండ్ రాడార్, ఇస్రో అభివృద్ధి చేసిన S-బ్యాండ్ రాడార్‌లు ఉన్నాయి. వీటిని కలిపి 12 మీటర్ల యాంటెన్నా ద్వారా డేటా సేకరిస్తుంది.
ఈ సందర్భంగా శ్రీహరికోట సమీపంలోని శ్రీ చెంగాళమ్మ దేవాలయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్‌తో పాటు శాస్త్రవేత్తలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిసార్ ఉపగ్రహ ప్రయోగంతో విశ్వంలో భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మరో గౌరవ ఘట్టం చేరనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.