భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌కి చేరిన తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత సాధించింది. సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ ఝోంగీపై 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో దివ్య తన తొలి గ్రాండ్ మాస్టర్ నార్మ్‌ను కూడా అందుకుంది.
మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య మంగళవారం జరిగిన తొలి గేమ్‌ను నల్లపావులతో డ్రా చేయగా, నిన్న జరిగిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడుతూ మెరుపు ప్రదర్శన కనబరిచింది. తాన్ ఝోంగీ చేసిన పొరపాట్లను కచ్చితంగా ఉపయోగించుకుని 101 ఎత్తుల్లో విజయాన్ని ఖాయంచేసింది. దీంతో 2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కి కూడా అర్హత పొందింది.
ఇక మరో సెమీఫైనల్‌లో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, చైనా క్రీడాకారిణి లీ టింగీతో రెండో గేమ్‌ను డ్రా చేయడంతో టై బ్రేక్‌కు వెళ్లనున్నారు. రాపిడ్, బ్లిట్జ్ గేమ్స్ ద్వారా ఫైనల్‌కి ఎవరు వెళతారో తేలనుంది. దివ్య దేశ్‌ముఖ్‌కు ఫైనల్లో హంపి లేదా లీ టింగీతో ఆడే అవకాశం ఉంది.