ఒకప్పుడు చిన్నచూపు ఎదుర్కొన్న ప్రభుత్వ పాఠశాలలు... ఇప్పుడు సీటు కోసం పోటీ పడే స్థాయికి చేరాయి. దీనికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోంది ఆదోనిలోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్. ఈ స్కూల్‌లో ప్రవేశాలు పూర్తవడంతో యాజమాన్యం 'నో అడ్మిషన్' బోర్డును ప్రదర్శించింది. ఈ దృశ్యాన్ని చూసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గర్వంతో స్పందించారు.
ఈ విద్యా సంవత్సరంలోనే 400 మందికిపైగా కొత్త అడ్మిషన్లు. ప్రస్తుతం ఈ హైస్కూల్‌లో 1,725 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో ఒక్క ఏడాదిలోనే 400 మందికి పైగా కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇప్పటికే సామర్థ్యం మేరకు ప్రవేశాలు పూర్తవడంతో, ఇకపై మరిన్ని అడ్మిషన్లు ఇవ్వలేమన్న కారణంతో ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టారు.
"మా పిల్లాడినైనా చేర్చండి సార్!" – తల్లిదండ్రుల వేడనలు. ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "నో అడ్మిషన్ బోర్డు చూసి చాలా ఆనందించాను. అడ్మిషన్లు పూర్తయ్యాయని చెప్పినా, తల్లిదండ్రులు తమ పిల్లలకైనా చోటు కల్పించమని బతిమాలుతున్నారన్న స్కూల్ హెడ్‌మాస్టర్ మాటలు ప్రభుత్వ విద్యకు దక్కిన గౌరవాన్ని తెలుపుతున్నాయి" అన్నారు.
ఉపాధ్యాయులే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌కు నిజమైన రథసారథులు. హెడ్‌మాస్టర్ ఫయాజుద్దీన్, టీచర్లు, సిబ్బందికి లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో ఇలాంటి 'నో అడ్మిషన్' బోర్డులు కనిపించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచిన ఉపాధ్యాయులే 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్'కు బలమైన మూలస్తంభాలని కొనియాడారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        