ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ముఖ్య నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, డా. పి.కృష్ణ మోహన్ (రిటైర్డ్)ను ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT Society) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా మరోసారి నియమించింది. ఈ నియామకం కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక సంవత్సరం కాలానికి అమల్లోకి వస్తుంది. దీనికి అనుగుణంగా ఆయకు నెలకు రూ.2 లక్షల వేతనం ఇవ్వబడనుంది.
ఇంతకుముందు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.హెమలతా రాణి (జాయింట్ డైరెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)ను తిరిగి ఆమె పేరెంట్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేయడం జరిగింది.
ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నట్లుగా, కొత్తగా నియమించబడిన సీఈఓ డా. పి.కృష్ణ మోహన్, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి సంబంధించిన అన్ని పరిపాలనా బాధ్యతలను తగిన విధంగా చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఆదేశం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతితో జారీ చేయబడింది.
ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశానుసారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పాలిటికల్) శ్రీ ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. సంబంధిత విభాగాలైన CRDA, ట్రైబల్ వెల్ఫేర్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానాధికారులకు ఈ ఉత్తర్వులు పంపడం జరిగింది.
గతంలో డాక్టర్ కృష్ణమోహన్ గారు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు OSD గాను, అదేవిధంగా సెర్ప్ (SERP) కు ఎండి గాను పనిచేశారు. దానికి ముందు వివిధ శాఖలలో పనిచేసి రిటైర్ అయ్యారు.
ఇప్పుడు వీరిని APNRT సీఈఓ గా నియమించిన సందర్భంగా పలు దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నియామకంతో ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి మరింత చురుకుదనం వస్తుందని, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రవాసి తరఫున వీరికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.