రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అంచనా వేశామని, ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు.
"ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంది. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది.
కేంద్రం ఇప్పటి వరకు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, 1.30 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరాయి. 0.47 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయి. ఆగస్టు నెలలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చింది.
మిగిలిన 0.90 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒడిశాలోని పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయి. రైతులకు ఎరువులు పారదర్శకంగా, సమయానికి అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (IFMS) ద్వారా పర్యవేక్షిస్తున్నాం.
మధ్యవర్తులు అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. నల్లబియ్యం, అరటి, చెరకు వంటి ప్రత్యేక పంటలకు ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుగుతోంది" అని మంత్రి అచ్చెన్న వివరించారు.