విశాఖ మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కి 22 ఎకరాలను ఎకరాకు 99 పైసల రేటులో కేటాయించడం వంటివి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్మానం విన్నది.
పిటిషనర్ల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి కూడా తమ వాదనలు తెలియజేసి, నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా భూములను కేటాయిస్తున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు.
హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మార్గం లేదని, విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉంది అని పేర్కొంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరం అని, ఇవ్వకపోతే కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ లకు వెళ్లిపోతాయని పిటిషనర్లను ప్రశ్నించింది.
ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం, ప్రభుత్వానికి ఆదాయం రావడం, భవిష్యత్తులో వచ్చే లాభాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అలాగే భూకేటాయింప్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.