దసరా, దీపావళి పండుగలతో పాటు భారీ వర్షాల కారణంగా అక్టోబర్ నెలంతా విద్యార్థులు పండగ వాతావరణంలో మునిగిపోయారు. చాలా ప్రాంతాల్లో అధికారులు వర్షాల తీవ్రత కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో, విద్యార్థులకు అక్టోబర్ నెలలో వరుసగా విశ్రాంతి లభించింది. ఇప్పుడు నవంబర్ నెల ప్రారంభమైంది. పండగ సీజన్ ముగిసినా, విద్యార్థులకు మళ్లీ సెలవుల వరద ఆగలేదనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల మొదటి వారంలోనే వరుసగా నాలుగు రోజుల సెలవులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
నవంబర్ 2 ఆదివారం సాధారణ సెలవు కాగా, 5న గురునానక్ జయంతి సందర్భంగా పాఠశాలలు, ఆఫీసులకు మరోసారి సెలవు ఉండనుంది. అదే రోజున కార్తీక పౌర్ణమి కూడా కావడంతో హిందువులలో భక్తి జోరు పెరుగుతోంది. కార్తీకమాసం సందర్భంగా దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. పౌర్ణమి పర్వదినం కావడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. దీని తర్వాత నవంబర్ 8 రెండో శనివారం, నవంబర్ 9 ఆదివారం — వరుసగా రెండు రోజుల సెలవులు. అంటే నవంబర్ 2, 5, 8, 9 తేదీల్లో విద్యార్థులు, ఉద్యోగులు మళ్లీ రిలాక్స్ మూడ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది.
అయితే అధికారిక సెలవులతో పాటు నవంబర్‌లో అనధికారిక సెలవులు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆగ్రహంతో ఉన్నాయి. నవంబర్ 1లోపు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుండి నిరవధిక బంద్ చేపడతామని ”ది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్” ప్రభుత్వం ముందుంచింది. నిజంగా ఈ బంద్ అమల్లోకి వస్తే విద్యార్థులకు అదనంగా కొన్ని రోజులు క్లాసులు లేకుండా ఉండే పరిస్థితి తలెత్తవచ్చు.
మొత్తంగా చూస్తే నవంబర్ మొదటి వారమే విద్యార్థులకు పండుగ మూడ్‌లో సాగనుంది. పౌర్ణమి, గురునానక్ జయంతి, వారాంతపు సెలవులతో పాటు విద్యాసంస్థల బంద్ జరిగితే దాదాపు వారం రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు మూతపడే అవకాశముంది. అక్టోబర్ నెలలో వర్షాల మధ్య గడిపిన విద్యార్థులు నవంబర్‌లో కూడా విశ్రాంతిని ఆస్వాదించేలా కనిపిస్తున్నారు. అయితే విద్యా సంవత్సరం సగం దాటిన ఈ సమయంలో తరగతులు ఆగిపోవడం వల్ల పాఠ్యాంశాల పూర్తి విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదమూ ఉంది.