Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి!

Janardhan Reddy: నిజంగా మూలాపేటలో 70 % పనులు పూర్తి చేసి ఉంటే, ఉత్తరాంధ్ర ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా ఎందుకు కొడతారు ?

Published : 2026-03-31 17:34:00
  • గణాంకాలు పరిశీలిస్తే.. వైసీపీ నేతలు చెప్పేవన్నీ అసత్యాలు, అవాస్తవాలని అర్థమవుతోంది…
     
  • 4 వంతు పనులు కూడా పూర్తి చేయని వైసీపీ 70 % పనులు పూర్తి చేశామనడం హాస్యాస్పదం..

Janardhan Reddy: శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట గ్రీన్ ఫీల్డ్  పోర్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నట్లు పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు.. రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులతో పాటు మూలాపేట పోర్టును కూడా 2026 చివరి నాటికి పూర్తి చేసి రాష్ట్రానికి మౌలిక సదుపాయాల హబ్‌గా మారుస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 

కేవలం రాజకీయ ఉనికి కోసం రోజూ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. తమ పబ్బం గడుపుకోవడం వైసీపీ నేతలకు ఆనవాయితీగా మారిందన్నారు.  ఒక కుటిల అజెండాతో మూలాపేట పోర్టు అభివృద్ధిపై అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మూలాపేట పోర్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని, ప్రస్తుతం పనులు అత్యంత శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం కేవలం పోర్టు శంకుస్థాపనలకే పరిమితమైందని, భూసేకరణ మరియు పరిహారం చెల్లింపుల్లో విఫలమై ప్రాజెక్టు జాప్యానికి కారణమైందని ఆగ్రహాం వ్యక్తం చేశారు..  వైసీపీ హయాంలో జరిగిన జాప్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని, అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అడ్డుతగలడం ఎంతమాత్రం సరికాదని మంత్రి హితవు పలికారు. పోర్టుకు అవసరమైన భూసేకరణ, పరిహారం పంపిణీ మరియు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో తమ ప్రభుత్వం పూర్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ నేతల "చలో మూలాపేట" వంటి రాజకీయ జిమ్మిక్కులను నమ్మవద్దని, ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు.

వైసీపీ హాయాంలో మూలపేట పోర్టు పనులు 70 శాతం పూర్తి చేశారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇదంతా కరపత్రికను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయమన్నారు.. కూటమి పాలనలో మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం అత్యంగా వేగంగా సాగుతూ ఇప్పటికే దాదాపు 70 %  పనులు పూర్తి చేశామన్నారు. 2014–2019 లో తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఫిబ్రవరి 2018 న పీపీపీ విధానంలో భావనపాడు పోర్ట్ అభివృద్ధికి పునాది పడిందన్నారు.. అనంతరం వైసీపీ ప్రభుత్వంలో అదానీ పోర్ట్స్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసి పోర్టు నిర్మాణంలో జాప్యానికి వైసీపీ కారమైందన్నారు.. 

అదే సమయంలో పోర్టుకు అవసరమైన భూసేకరణ, ఉప్పు భూములు సమస్య, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, ల్యాండ్‌ ఎక్విజేషన్‌, పీడీఎఫ్‌లు చెల్లింపులు, రోడ్డు, రైలు కనెక్టివిటీలకు అవసరమైన భూసేకరణ ఏదీ పూర్తిస్థాయిలో చేపట్టకుండానే  గత వైసీపీ ప్రభుత్వం హడావుడిగా 2023 ఏప్రిల్‌ 19 న మూలపేట పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిందన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో  జూన్ 2024 లో అధికారం నుంచి దిగిపోయే నాటికి కేవలం  రూ. 718 కోట్లు వెచ్చించి 25.02 % పనులు మాత్రమే చేయగలిగిందన్నారు.. అయితే వైసీపీ నేడు రోజుకో మాట, పూటకో ఈవెంట్ తో నిజాలను వక్రీకరిస్తూ అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు..

2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోర్టు నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందన్నారు.. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు రూ. 1,835 కోట్లు వెచ్చించి 69.57 శాతం పనులు పూర్తి చేయగలిగామన్నారు... గత 20 నెలల్లో దాదాపుగా 44 శాతం పైగా పనులను రూ. 1117 కోట్లు వెచ్చించి చేయడం జరిగిందన్నారు. ఈ గణంకాలు చూస్తే, ఎవరూ క్రెడిట్ చోరీనో, ఎవరూ  క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం  ప్రజలకు అర్ధమవుతుందన్నారు..

2024 జూన్ నాటికి పోర్టు భౌతిక పురోగతి మొత్తం 25.02 % గా ఉండగా ప్రస్తుతం 69.57% పనులు శరవేగంగా పూర్తి చేశామని చెప్పగలం.. గత 20 నెలల్లో దాదాపు 44.55 % పనులు పూర్తి చేశామన్నారు.

బ్రేక్‌వాటర్ పనులు జూన్ 2024 నాటికి 28.9% పూర్తయితే గత 20 నెలల్లో 59.92% శాతం పూర్తి చేశాం.. మొత్తంగా 88.82% శాతం పనులు పూర్తి చేశామన్నారు.

డ్రెడ్జింగ్ & రిక్లమేషన్ పనులు జూన్ 2024 నాటికి 37.8% పూర్తయ్యితే గత 20 నెలల పాలనలో 43.67 % పనులు పూర్తి చేశాం.. మొత్తంగా ఇప్పటి వరకు 81.47% పనులు పూర్తయ్యాయన్నారు.

బెర్త్ లకు సంబంధించి జూన్ 2024 నాటికి  26.3% శాతం పనులు పూర్తయితే, గత 20 నెలల్లో 50.25% పనులు పూర్తి చేశాం.. మొత్తంగా 76.55% పనులు పూర్తయ్యాయి..

ఆన్‌షోర్ మౌలిక వసతులు వైసీపీ హాయాంలో ప్రారంభమే కాలేదు.. గత 20 నెలల్లో దాదాపు 8.99% పనులు పూర్తి చేశాం.

బాహ్య మౌలిక వసతులు కల్పన పనులకు సంబంధించి 2024 జూన్ నాటికి 2.3% పూర్తయితే గత 20 నెలల్లో 24.26 శాతం పూర్తి చేశాం.. మొత్తంగా ఇప్పటి వరకు 26.56% పనులు పూర్తయ్యాయి..

ఆర్థిక పురోగతికి సంబంధించి 2019–24 లో రూ. 718.50 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ. 1835.98 కోట్ల మేర పనులు చేపట్టడం జరిగింది.. మొత్తంగా గత 20 నెలల పాలనలో రూ. 1117.48 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు..

పోర్టుకు సంబంధించి ఉప్పు భూముల సేకరణ విషయంలో నాటి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎటువంటి ప్రయత్నం చేసిన పాపాన పోలేదు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, 385.24 ఎకరాల భూసేకరణకు అనుమతి పొందడం జరిగింది.

గత వైసీపీ ప్రభుత్వంలో మూలాపేట, విష్ణుచక్రం గ్రామాల్లో పునరావాసం (R&R) కోసం సీరియస్ గా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.. గత 20 నెలల కూటమి ప్రభుత్వంలో విష్ణుచక్రం గ్రామంలో పూర్తిగా పునరావాసం కల్పించడం జరిగింది. అలాగే మూలపేట గ్రామంలో పునరావాసం పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి..

మొత్తంగా మూలాపేట పోర్టు నిర్మాణంకు సంబంధించి వాస్తవాలు ఇలా ఉండగా జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేయడంతో పాటు ప్రజల్లో అనుమానాలు తావిచ్చేలా, ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం అత్యంత దురదృష్టకరం.. మూలాపేట పోర్టులో 4 వ వంతు పనులు కూడా పూర్తి చేయని, వైసీపీ నేడు 70 శాతం పనులు పూర్తి చేశామని చెప్పడం చూస్తే నిజమైనా క్రెడిట్ చోరీ ఎవరో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమవుతుందన్నారు.. గతంలో విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానన్న మీ మాయ మాటలు నమ్మకుండా మీకు ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయారా అని మంత్రి ప్రశ్నించారు. ఇటువంటి చెత్త రాజకీయాలు చేయడం వల్లే ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో వైసీపీకి ప్రజలు గుండు సున్నా చుట్టారనే విషయం మర్చిపోవద్దు.. ఇప్పటికైనా వైసీపీ ఆలోచన విధానం మారకపోతే, భవిష్యత్తులో ఆ పార్టీ నామ రూపాల్లేకుండా పోయే పరిస్థితి వస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు..

Spotlight

Read More →