వంట గ్యాస్ సిలిండర్ రాకతో ప్రజల జీవితంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఎక్కువ కుటుంబాలు కట్టెలు, బొగ్గులు, పిడకలు వాడుతూ వంట చేసేవి. దీని వల్ల పొగతో అనారోగ్య సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువయ్యేవి. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, చిన్న పిల్లలు ఈ సమస్యలతో బాధపడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, శుభ్రమైన ఇంధనాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో "ప్రధాన మంత్రి ఉజ్వల యోజన" (PMUY)ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు తక్కువ ధరకు సిలిండర్లు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 కోట్లకుపైగా కుటుంబాలు ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నారు.
ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం పేద కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు సురక్షితమైన వంట ఇంధనం అందించడం. ఉజ్వల యోజన కింద లబ్ధిదారులు ఏడాదికి 12 సిలిండర్లు పొందవచ్చు. మార్కెట్ ధర రూ.900 పైగా ఉన్నప్పటికీ, ఈ పథకం ద్వారా ఒక్కో సిలిండర్‌ను కేవలం రూ.550కే అందిస్తున్నారు. కొత్త కనెక్షన్ తీసుకున్నవారికి తొలి సిలిండర్ ఉచితంగా ఇస్తారు. అదనంగా 14.2 కిలోల సిలిండర్‌కు రూ.2200, 5 కిలోల సిలిండర్‌కు రూ.1300 ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే వడ్డీ లేని రుణం ద్వారా వంట గ్యాస్ స్టవ్ కొనుగోలుకు కూడా సాయం అందిస్తున్నారు. ఈ విధంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉజ్వల యోజన ఒక వరంగా నిలుస్తోంది.
ఉజ్వల యోజన కింద లబ్ధిదారుల అర్హతలు స్పష్టంగా నిర్ణయించారు. దరఖాస్తుదారు మహిళ అయి ఉండాలి మరియు ఆమె వయస్సు 18 సంవత్సరాలు పైబడాలి. భారతీయ పౌరురాలు కావాలి. ఆమె కుటుంబం దారిద్య్ర రేఖ (BPL) కిందకి రావాలి. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), అంత్యోదయ అన్న యోజన (AAY) లబ్ధిదారులు కూడా దీనికి అర్హులు. అవసరమైన పత్రాలుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి. అదనంగా e-KYC తప్పనిసరి, అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు ఉంది.
ఈ పథకం ప్రయోజనాల వల్ల అనేక కుటుంబాల్లో మార్పు వచ్చింది. కట్టెలు, బొగ్గులు మోసే కష్టం తగ్గింది. పొగతో వచ్చే శ్వాసకోశ సమస్యలు తగ్గి, గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడింది. వంట వేగం పెరగడంతో సమయం ఆదా అవుతోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్ చేరువ కావడంతో వారు కూడా ఆధునిక వంట విధానాలను అనుసరించే స్థాయికి చేరుకున్నారు. ఈ పథకం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది, ఎందుకంటే కట్టెల వినియోగం తగ్గి అడవుల సంరక్షణకు తోడ్పడుతోంది.
ఉజ్వల యోజనకు దరఖాస్తు చేసుకోవడం సులభం. లబ్ధిదారులు ఉజ్వల యోజన అధికారిక వెబ్‌సైట్ ([https://pmuy.gov.in)లోకి](https://pmuy.gov.in%29లోకి) వెళ్లి "Apply for New Ujjwala 2.0 Connection"పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తాము ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీ (Indane, Bharat Gas, HP Gas) ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అవసరమైన పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, IFSC కోడ్, BPL సర్టిఫికేట్ సమర్పించి దరఖాస్తు చేస్తే గ్యాస్ కనెక్షన్ మంజూరు అవుతుంది. ఈ విధంగా ఉజ్వల యోజన పేద కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది.