ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున ప్రమోషన్లు కల్పించారు. ఒకేసారి 211 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో 53 మంది ఎంపీడీవోలు డీఎల్‌డీవోలుగా ప్రమోషన్ పొందగా, మరో 158 మంది డిప్యూటీ ఎంపీడీవోలుగా, జిల్లా పరిషత్, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో పరిపాలనా అధికారులుగా పదోన్నతులు పొందారు.
ఎన్నికల తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శాఖా ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ఓఎస్డీ వెంకట కృష్ణను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో మూడు నెలలపాటు అక్రెడిటేషన్ కార్డుల గడువును పొడిగించింది. ఆగస్టు 31తో ముగియాల్సిన గడువు ఇప్పుడు నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. పౌర సంబంధాల శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కార్డులు త్వరగా ఇవ్వాలని జర్నలిస్టులు కోరుతున్నారు.