భారతదేశంలో జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున గణపతి కి పూజలు జరుగుతాయి. ఈ రోజు చిన్నా, పెద్దా అందరూ భక్తిశ్రద్ధలతో గణపతిని ఆహ్వానించి, తన ఇల్లు లేదా కాలనీ లో ప్రతిష్ఠాపన చేస్తారు. గణనాధుడిని సకల విఘ్నాలను తొలగించే వాడిగా, విజయానికి మార్గం చూపించే వాడిగా భావిస్తారు.
వినాయక చవితి పండుగలో ప్రజలు ఉదయాన్నే స్నానం చేసి, గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తారు. మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారు. పువ్వులు, ఆకులు, పండ్లు, ప్రత్యేకంగా తయారు చేసే మోదకాలు, ఉండ్రాళ్లు వంటి నైవేద్యాలతో గణపతిని సత్కరిస్తారు. “కలసి చేసే పూజలో ఆనందం ఎక్కువ” అనే నమ్మకంతో చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మండపాల్లో గణపతి విగ్రహాలు ప్రతిష్ఠాపించి, సమూహ పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇది కేవలం భక్తి, ఆనందాల పండుగ మాత్రమే కాదు, ఆర్థికపరంగా కూడా ఎంతో ముఖ్యమైనది. వినాయక చవితి ముందు నుంచే మార్కెట్లలో ఒక ప్రత్యేక వాతావరణం నెలకొంటుంది. మట్టి విగ్రహాల తయారీదారులు ఈ పండుగ కోసం నెలల తరబడి శ్రమిస్తారు. చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాల వరకు తయారుచేసి మార్కెట్లో అమ్ముతారు. వీరి ఆదాయం ఎక్కువగా ఈ పండుగ ద్వారానే వస్తుంది.
ఇదే కాకుండా, పువ్వుల వ్యాపారులు కూడా మంచి లాభాలను ఆర్జిస్తారు. పూజలో ఉపయోగించే జపా, గన్నేరు, గుమ్మడి, తామర వంటి పువ్వులకు ఈ సమయంలో డిమాండ్ పెరుగుతుంది. ఆకుల వ్యాపారులు కూడా లాభపడతారు. పూజలో వినాయకుడికి 21 రకాల పత్రిక సమర్పించటం ఆనవాయితీ. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆకులు సేకరించే వారికి, పట్టణాల్లో అమ్మేవారికి ఉపాధి వస్తుంది.
అదే విధంగా, మిఠాయి దుకాణాలు కూడా ఈ పండుగ సమయంలో బాగా సంపాదిస్తాయి. గణపతికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్లు, లడ్డు, జిలేబి వంటి వంటకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కుటుంబాలు ఇంట్లో తయారు చేసుకోవడంతో పాటు బయట నుండి కూడా కొనుగోలు చేస్తారు.
విగ్రహాల రవాణా చేసే వాహనదారులు, మండపాల అలంకరణ చేసే డెకరేటర్లు, సౌండ్ సిస్టమ్ వ్యాపారులు, దీపాలు, బాణసంచా అమ్మేవారు – వీరందరికీ ఈ పండుగ రోజులు ఒక మంచి సంపాదన అవకాశాన్ని కల్పిస్తాయి. వినాయక నిమజ్జన సమయంలో రవాణా వ్యాపారులకు, బోట్ల వారికి ఉపాధి వస్తుంది.
ఇలా చూసుకుంటే వినాయక చవితి పండుగ అనేక వర్గాల వారికి జీవనోపాధిని కలిగించే ఒక ఆర్థిక శక్తిగా మారింది. ఒక రోజు పూజతోనే ఆగిపోకుండా, పది రోజుల పాటు గణపతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ పది రోజులలో అనేక మంది చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఉపాధి పొందుతారు.
పండుగ ముగిసినప్పుడు గణపతి నిమజ్జనం చేస్తారు. భక్తులు గణేశున్ని “మళ్లీ త్వరగా రా” అంటూ వీడ్కోలు పలుకుతారు. ఈ విధంగా వినాయక చవితి భక్తి, ఆనందం, సామాజిక ఐక్యత మాత్రమే కాకుండా, ఆర్థిక చైతన్యానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది.
మొత్తం మీద వినాయక చవితి పండుగ మనకు గణనాధుడి ఆశీస్సులు మాత్రమే కాదు, అనేక కుటుంబాలకు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. చిన్న వ్యాపారులు, కార్మికులు, కళాకారులు ఈ పండుగ ద్వారానే సంవత్సరంలో పెద్ద మొత్తంలో సంపాదించగలరు. అందుకే వినాయక చవితి మనకు “భక్తి పండుగ” మాత్రమే కాదు, “సంపద పండుగ” కూడా అని చెప్పవచ్చు.