
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇది పెద్ద షాక్ కానుంది. ఫీ స్ట్రక్చర్ మరియు ఇతర ఛార్జీలను సవరించినట్లు ఎస్‌బీఐ కార్డ్ ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పేమెంట్స్, వాలెట్ లోడింగ్ వంటి ట్రాన్సాక్షన్లపై ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ఎస్‌బీఐ కార్డు హోల్డర్లు తప్పనిసరిగా కొత్త నిబంధనలను తెలుసుకోవడం అత్యంత అవసరం. తెలియకపోతే అనుకోని అదనపు ఖర్చులు భరించే పరిస్థితి వస్తుంది.
థర్డ్ పార్టీ యాప్స్ (క్రెడ్, చెక్, మొబి క్విక్ వంటివి) ద్వారా చేసే ఎడ్యుకేషన్ సంబంధిత పేమెంట్లకు ఇకపై 1% ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ కార్డ్ స్పష్టం చేసింది. అయితే, నేరుగా స్కూల్స్, కాలేజీలు లేదా యూనివర్సిటీలకు పేమెంట్ చేస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. మరోవైపు వాలెట్ లోడింగ్‌పై కూడా కొత్త ఛార్జీలు అమలు కాబోతున్నాయి. రూ.1,000 దాటే ప్రతి వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్‌పై 1% ఫీజు పడనుంది. మెర్చంట్ కేటగిరీ కోడ్స్ (MCC) ప్రకారం 8211, 8220, 8241, 8244, 8249, 8299 కింద వచ్చే ట్రాన్సాక్షన్లపై ఈ ఫీజులు వర్తిస్తాయి.
క్యాష్ పేమెంట్స్, చెక్ పేమెంట్స్, లేట్ పేమెంట్స్, కార్డ్ రీప్లేస్మెంట్ వంటి ఇతర ఛార్జీలలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయలేదని ఎస్‌బీఐ కార్డ్ పేర్కొంది. ప్రస్తుతానికి క్యాష్ పేమెంట్ ఫీజు రూ.250గా ఉంది. చెక్ పేమెంట్ ఫీజు రూ.200గా ఉంటుంది. లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.500 నుంచి రూ.1,100 వరకు ఉంటాయి. క్యాష్ అడ్వాన్స్ ఫీజు ఎస్‌బీఐ ఏటీఎంలలో లేదా ఇతర దేశీయ ఏటీఎంలలో 2.5% (కనీసం రూ.500)గా ఉంది. అంతర్జాతీయ ఏటీఎంలలో కూడా ఇదే రీతిలో ఛార్జీలు ఉంటాయి. అంటే, తరచూ క్యాష్ విత్‌డ్రా చేసే యూజర్లు ఈ ఫీజులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
కార్డ్ రీప్లేస్మెంట్ ఫీజు రూ.100 నుంచి రూ.250 వరకు ఉంటుంది. అయితే ఆరమ్ కార్డులకు ఇది రూ.1,500 వరకు పెరుగుతుంది. విదేశాల్లో ఎమర్జెన్సీగా కార్డ్ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే, వీసా కార్డులకు కనీస ఛార్జీ 175 డాలర్లు, మాస్టర్ కార్డులకు 148 డాలర్లుగా నిర్ణయించారు. దీంతో క్రెడిట్ కార్డు వినియోగదారులు ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంగా, ఎస్‌బీఐ కార్డు వినియోగదారులకు కొత్త ఛార్జీలు గట్టి బరువుగా మారే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం తప్పనిసరి.