ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ మరో మూడు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయశాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ పోస్టులకు ఆగస్టు 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8, 2025 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అలాగే రాష్ట్ర దేవాదాయశాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం కూడా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆగస్టు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి, సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు.
ఇక భూగర్భజలశాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి కూడా దరఖాస్తులు ఆగస్టు 13 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతాయి.
ఈ వివరాలన్నీ ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఓటీపీఆర్ (One Time Profile Registration) తప్పనిసరి. అభ్యర్థులు ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని, పొందిన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        