Business- రాయలసీమ మైనింగ్ హిస్టరీలో సరికొత్త రికార్డు…
కర్నూలు జొన్నగిరిలో త్వరలోనే 'గోల్డ్' సైరన్.. రూ. 400 కోట్ల భారీ ప్రాజెక్టు ముస్తాబు.
తగ్గనున్న విదేశీ దిగుమతుల భారం: దేశీయ రికార్డుల దిశగా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్…
Gold Field: భారతదేశ మైనింగ్ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. రాష్ట్రం త్వరలోనే దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రంగా మారబోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కర్నూలు జిల్లాలోని ప్రతిష్టాత్మక 'జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్' (JGF) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల జూన్‌లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రైవేట్ బంగారు గని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ఒకప్పుడు దేశంలో బంగారం ఉత్పత్తి అనగానే అందరికీ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) గుర్తుకు వచ్చేదని, అయితే రాబోయే రోజుల్లో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ (JGF) ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోనే సమగ్ర ప్రాసెసింగ్ ప్లాంట్‌తో ఏర్పాటు చేసిన మొదటి భారీ ప్రైవేట్ బంగారు గని ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో అత్యధిక శాతం వాటా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుందని, ఇది రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
జొన్నగిరి గనిలో బంగారం ఉత్పత్తికి సంబంధించిన లక్ష్యాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే (ఈ ఏడాది) సుమారు 600 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాతి ఏడాది (రెండో ఏడాది) నుంచి వార్షిక ఉత్పత్తిని 1,500 కిలోలకు పెంచడమే ధ్యేయంగా పనులు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. దీనివల్ల దేశీయంగా బంగారం లభ్యత పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ఇతర దేశాల నుండి భారత్‌కు జరిగే బంగారం దిగుమతుల భారం గణనీయంగా తగ్గుతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో దాదాపు 598 హెక్టార్ల విస్తీర్ణంలో రూ. 400 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు త్రివేణి ఎర్త్‌మూవర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ గనిని అభివృద్ధి చేశాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఈ గనిలో సుమారు 13.1 టన్నుల ధృవీకరించబడిన బంగారు నిల్వలు ఉండగా, అన్వేషణ పెరిగే కొద్దీ ఇవి 42 టన్నుల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఈ తరహా భారీ పారిశ్రామిక మరియు మైనింగ్ ప్రాజెక్టులు రావడం వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం మైనింగ్ పనులే కాకుండా విద్యా, వైద్య రక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా చేపట్టనున్నారు. పుట్టపర్తి డిఫెన్స్ హబ్‌గా, కర్నూలు గోల్డ్ హబ్‌గా మారుతుండటంతో రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో బలోపేతం కానుందని, పారదర్శకమైన విధానాలతో పెట్టుబడిదారులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.