ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు నవంబర్ నెలలో తక్కువ సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్‌లో వరుసగా పండుగలు, వర్షాల కారణంగా అనేక రోజులు స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో, నవంబర్ నెలలో మాత్రం విద్యాసంస్థలు సాధారణ విధంగా కొనసాగనున్నాయి. ఈ నెలలో ఉన్న సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలు ఆదివారాలు కాగా, నవంబర్ 8న రెండో శనివారం సెలవు ఉంటుంది. అదనంగా నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, నవంబర్ 6న హజరత్ సయ్యద్ మొహ్మద్ జువాన్‌పూర్ మెహిదీ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడేలు ఉండనున్నాయి. మొత్తంగా ఈ నెలలో ఆరు సెలవులు మాత్రమే ఉండగా, వర్కింగ్ డేస్ 25గా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, గత నెలల్లో విద్యార్థులు మాత్రం సెలవులతో మునిగిపోయారు. ముఖ్యంగా అక్టోబర్ నెలలో మోంథా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. అక్టోబర్ 24 నుండి 27 వరకు వరుసగా సెలవులు ప్రకటించారు. దసరా పండుగలు ముగిసిన వెంటనే తుఫాన్ కారణంగా వచ్చిన ఈ అనుకోని సెలవులు విద్యార్థులకు అదనపు విశ్రాంతిని ఇచ్చాయి. అయితే దీని వల్ల సిలబస్ పూర్తిచేయడంలో ఆలస్యాలు చోటుచేసుకున్నాయని పాఠశాలల నుంచి సమాచారం.
గత నెలల ట్రెండ్ చూస్తే విద్యార్థులు పెద్ద ఎత్తున సెలవులను ఆస్వాదించారు. ఆగస్టు నెలలో మొత్తం 31 రోజుల్లో 10 రోజులు సెలవులు వచ్చాయి — అంటే కేవలం 21 రోజులు మాత్రమే క్లాసులు జరిగాయి. అదే విధంగా సెప్టెంబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా 11 రోజుల భారీ సెలవులు (సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు) ప్రకటించారు. అదనంగా మూడు ఆదివారాలు కూడా రావడంతో ఆ నెలలో మొత్తం 14 రోజుల పాటు స్కూళ్లు మూతపడ్డాయి.
ఈ సారి నవంబర్ నెలలో విద్యార్థులకు పెద్దగా విరామం లేకపోవడం ఖాయం. నెల చివరిలో లేదా మధ్యలో ఎలాంటి పండుగలు లేకపోవడంతో ఎక్కువ రోజులు క్లాసులు జరగనున్నాయి. అయితే డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా మళ్లీ సెలవులు ఉండనున్నాయి. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు కూడా రానున్నాయి. కాబట్టి విద్యార్థులు నవంబర్ నెలలో పాఠాలపై దృష్టి సారించేందుకు ఇది సరైన సమయం అవుతుందని విద్యా శాఖ సూచిస్తోంది.