AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే!

AndhraPradesh: సముద్ర జలాల్లో సరిహద్దు వివాదాలు మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న ఈ కొత్త నిఘా వ్యవస్థ మరియు టాస్క్ ఫోర్స్ ద్వారా స్థానిక మత్స్యకారులకు రక్షణ లభించనుంది. మత్స్యకారులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి కోరారు.

Published : 2026-03-24 17:00:00

Politics- నెల్లూరులో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష…

కోస్టల్ మెరైన్ టాస్క్ ఫోర్స్ బలోపేతం…

తమిళనాడు పడవల వివాదంపై వైసీపీ రాజకీయం…

AndhraPradesh Nellore: నెల్లూరు జిల్లాలో తమిళనాడు మత్స్యకారుల బోట్ల చొరబాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఏపీ సరిహద్దుల్లోకి ఇతర రాష్ట్రాల పడవలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు కోస్టల్ మెరైన్ టాస్క్ ఫోర్స్ (Marine Task Force) ను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

గతంలో నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే తమిళనాడు బోట్లు ఏపీ జలాల్లోకి వచ్చి వేట సాగిస్తున్నాయని, దీనివల్ల స్థానిక మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. దీనిని అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన నిఘా వ్యవస్థను జూన్ 15 నాటికి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే, ఏప్రిల్ 15 వరకు తమిళనాడు బోట్లు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమస్యపై తమిళనాడు ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతామని ఆయన తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేట నిషేధ భృతిని రూ. 20 వేలకు పెంచడమే కాకుండా 50 ఏళ్లకే రూ. 4000 పెన్షన్ అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. వలలు, పడవలను సబ్సిడీపై అందిస్తూ వారి ఉపాధికి భరోసా ఇస్తున్నామని చెప్పారు. వివాదాస్పద జీవో నెం.217ను రద్దు చేసి మత్స్యకారులకు అండగా నిలిచామని, పెండింగ్‌లో ఉన్న ఫిషింగ్ హార్బర్లను (Fishing Harbours) వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని వివరించారు.

ఇదే సమయంలో వైసీపీ నేతలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత్స్యకారుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ అంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్స్యకార గ్రామాల సమస్యలను ఆ గ్రామస్థులే చర్చించుకుని పరిష్కరించుకునేలా అధికారులు తోడ్పాటు అందించాలని సూచించారు.

ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు వద్ద ఫిష్ ల్యాండింగ్‌కు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని, పులికాట్ సరస్సు సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని, బ్యాంకుల నుండి రుణాల మంజూరును సులభతరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్.ఎం.డి. ఫరూక్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spotlight

Read More →