ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణలో మరో పెద్ద అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీని ప్రారంభించనుంది. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని ఆధారంగా తీసుకుని కొత్త విధానాన్ని రూపొందించారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. మొత్తం 1.63 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నాయి.
ప్రభుత్వం రూపొందించిన యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా 3,257 రకాల చికిత్సలు ఉచితంగా లభించనున్నాయి. చిన్న వ్యాధుల నుండి పెద్ద ఆపరేషన్ల వరకు వైద్య సేవలు అందిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. దీనిని హైబ్రిడ్ విధానంలో అమలు చేయనున్నారు అంటే ప్రజలు తాము కోరుకున్న ఆసుపత్రిలోనే చికిత్స పొందగలరు.
ఆర్థిక భారం తగ్గింపు – ఇప్పటివరకు ఒక పెద్ద ఆపరేషన్ లేదా చికిత్స కోసం కుటుంబాలు అప్పులు చేసి ఇబ్బందులు పడ్డాయి. ఇకపై ఆ బాధ తప్పుతుంది. అందరికీ నాణ్యమైన వైద్యసేవలు – పేదరికం కారణంగా చికిత్స మానేయాల్సిన పరిస్థితి తొలగిపోతుంది. ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా సౌకర్యం – మంచి వైద్యం పొందాలనే కల సాకారం అవుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు సమాన ప్రయోజనం – ఇక వైద్య సౌకర్యం దూరం అవ్వదు.
ఈ విధానం రాష్ట్ర ఆరోగ్యరంగంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాలు వేర్వేరు విధానాలతో ఆరోగ్య బీమా పథకాలు అమలు చేసినప్పటికీ, అందరికీ సమానమైన వైద్య భీమా ఇవ్వడం ఏపీలోనే మొదటిసారి. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్యరంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
“ఆరోగ్యం లేకపోతే అన్నీ వృధా” అనే సామెతను గుర్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి కుటుంబానికి ఊరట కలిగించనుంది. ఇకపై డబ్బుల లేమి కారణంగా ఎవరికీ వైద్యం ఆగిపోదు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఆరోగ్య భీమా అందించడం నిజంగా ఒక మానవీయ నిర్ణయం. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుతో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి ఏపీ ప్రజలకు మరింత చేరువ కానుంది.