ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ అండ్ కో అడ్డుకుంటోందని.. పిల్ల సైకోల విష ప్రచారం శ్రుతి మించుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రముఖ కంపెనీలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు వస్తే.. వాటిపైనా దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
రాష్ట్ర భవిష్యత్తును ఐదేళ్లు నాశనం చేసిన జగన్.. నేడూ అదే ధోరణిని అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్, సిలికాన్ స్కామ్, శాండ్ స్కామ్, ల్యాండ్ స్కాములు బయట పడటంతో వైకాపా నేతలు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తూ పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైకాపా నేతలు తమ కుంభకోణాల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు.