గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH) వైద్యులు అసాధారణమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ముఖంపై ఉన్న కణితితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి, దానిని పూర్తిగా తొలగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.వి. రమణ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు.
ప్రత్తిపాడుకు చెందిన అశోక్ అనే వ్యక్తి చాలా కాలంగా ముఖంపై కణితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఆయన చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చారు. వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించగా, ఆ కణితి 'పారోటిడ్ కార్సినోమా' అని, ఇది భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని గుర్తించారు. దీనితో ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
ఉచితంగా విజయవంతమైన శస్త్రచికిత్స…
డాక్టర్ రమణ మాట్లాడుతూ, ఈ శస్త్రచికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ అశోక్‌కు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద దీనిని ఉచితంగా చేశామని తెలిపారు. ప్రొఫెసర్ కిరణ్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
శస్త్రచికిత్స చేసిన వైద్య బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, అశోక్‌కు ధైర్యం చెప్పి శస్త్రచికిత్సకు సిద్ధం చేశామన్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి, రోగికి పూర్తిగా మత్తు ఇచ్చి, ముఖ కండరాలకు ఎటువంటి నష్టం కలగకుండా అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేశామని వివరించారు. ఈ సర్జరీ విజయవంతం కావడానికి వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది అందరూ సహకరించారని ఆయన ప్రశంసించారు.