పర్యాటక ప్రాంతాల్లో మద్యం తక్కువ ధరకు లభించడమో, కలెక్షన్ కోసం కావాలనో లేక వ్యక్తిగత ఆసక్తి వల్ల చాలామంది ట్రిప్ నుంచి మద్యం సీసాలు కొనుగోలు చేసి తిరిగి వస్తుంటారు. అయితే రైలు ప్రయాణంలో వీటి తరలింపు ఎంతవరకు చట్టబద్ధమో అనేది చాలా మందికి తెలియదు. రైల్వే శాఖ అందించిన సమాచారం ప్రకారం, మద్యం తీసుకెళ్లడంపై ప్రత్యేక నిబంధనలు లేకపోయినప్పటికీ, మద్యం రవాణా విషయంలో ప్రతి రాష్ట్రానికి తనదైన ఎక్సైజ్ నిబంధనలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మద్యం నిషేధించబడినందున, అటువంటి ప్రాంతాల్లో మద్యం తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం.
ఒకవేళ మద్యం సీసాలు తీసుకెళ్లాలనుకుంటే, గరిష్టంగా రెండు బాటిళ్లు మాత్రమే అనుమతించబడతాయి. ఒక్కో బాటిల్ 750 మిల్లీ లీటర్లు మించకూడదు. మద్యం సీసాలు సీల్ చేసి ఉండాలి, కొనుగోలు రసీదు కూడా ఉండాలి. ఈ పరిమితికి మించి తీసుకెళ్లాలంటే సంబంధిత రాష్ట్ర ఎక్సైజ్ డిపార్టుమెంట్స్ నుండి లైసెన్స్ లేదా స్పెషల్ అనుమతి తప్పనిసరి. బీహార్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం వంటి మద్యం నిషేధిత రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తీసుకెళ్లరాదు. అలా చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవు – ఫైన్, జైలు శిక్షలు విధించబడే అవకాశముంటుంది.