Politics: 60 కొత్త భవనాలు, 90 ఆధునీకరణ పనులు…
రెండు నెలల్లోగా ప్రజలకు అందుబాటులోకి 150 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు…
ఐపిహెచ్‌యస్ ప్రమాణాలతో సరికొత్త ఆయుష్ భవనాలు…
Ayush Centers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచీన వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా రూ. 44 కోట్ల భారీ వ్యయంతో 150 ఆయుష్ (Ayush) ఆరోగ్య కేంద్రాల నిర్మాణ మరియు ఆధునీకరణ పనులను వేగవంతం చేసింది. గత ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అనేక కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవతో భారతీయ వైద్య సేవలు బలోపేతం అవుతాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వెల్లడించారు.
ఈ 150 కేంద్రాలలో 60 నూతన భవనాల నిర్మాణం జరుగుతుండగా, మరో 90 కేంద్రాలకు ఆధునీకరణ పనులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHC) మరియు జిల్లా ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఈ ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని, రాబోయే రెండు నెలల్లోగా వీటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC) ఈ పనులను పర్యవేక్షిస్తోంది.
నూతనంగా నిర్మిస్తున్న ఈ భవనాలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (IPHS) మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ప్రతి కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ కోసం ప్రత్యేక గది, ఫార్మసీ, రిసెప్షన్ మరియు టాయిలెట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు (Infrastructure) ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' బ్రాండింగ్ నిబంధనల ప్రకారం ఈ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీనివల్ల ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వైద్యం కోరుకునే వారికి మెరుగైన వసతులు లభిస్తాయి.
ముఖ్యంగా 8 జిల్లా ఆసుపత్రుల్లో ఒక్కో కేంద్రానికి రూ. 50 లక్షల చొప్పున వెచ్చించి అత్యాధునిక ఆయుష్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, చిత్తూరు, కడప, కర్నూలు మరియు నంద్యాల జిల్లా ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఈ నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) వార్షిక ప్రణాళికలో భాగంగా ఈ నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆయుష్ ఆసుపత్రుల రూపురేఖలను మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, తక్కువ ఖర్చుతో కూడిన ప్రాచీన వైద్య సేవలు సామాన్యులకు సులభంగా దొరుకుతాయి. ఇరుకు గదులు, సౌకర్యాలు లేని పాత భవనాల స్థానంలో అత్యాధునిక కేంద్రాలు రావడం వల్ల వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై ప్రాచీన వైద్య విధానాల ప్రభావం ఎంతో ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.