భారత ప్రభుత్వం విమాన ప్రయాణ వ్యవస్థను ఆధునీకరించడానికి మరో కీలక అడుగు వేసింది. అదే,ఇ-పాస్‌పోర్ట్‌ల అధికారిక ప్రారంభం. ఈ కొత్త ఇ-పాస్‌పోర్ట్‌లు ప్రయాణికుల భద్రతను పెంచడం, ఇమిగ్రేషన్ చెక్‌లను వేగవంతం చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడే విధంగా రూపుదిద్దుకున్నాయి. ఇకపై విదేశాలకు వెళ్తున్న భారతీయుల ప్రయాణ పద్ధతిలో ఇది ఒక పెద్ద సాంకేతిక మార్పుగా నిలవనుంది.
ఇ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?
ఇది మనకు తెలిసిన సాధారణ పాస్‌పోర్ట్‌లాగే ఉంటుంది. అయితే దీని వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ చిప్‌ను అమరుస్తారు. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత మరియు బయోమెట్రిక్ వివరాలు సురక్షితంగా నిల్వ ఉంటాయి. అందులో వేలిముద్రలు, ముఖ గుర్తింపు వివరాలు, డిజిటల్ సంతకాలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
పాస్‌పోర్ట్‌పై ముద్రించిన వివరాలు మరియు చిప్‌లో ఉన్న సమాచారం ఒకేలా ఉంటాయి. దీని వలన నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేయడం లేదా వివరాలను మార్పిడి చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది.
ఇక ఇ-పాస్‌పోర్ట్ కవర్‌పై బంగారు రంగులో ఒక ప్రత్యేక చిహ్నం ఉంటుంది. దీనివల్ల విమానాశ్రయాలు, ఇమిగ్రేషన్ పాయింట్‌ల వద్ద సులభంగా గుర్తించవచ్చు. చిప్ స్కానింగ్ సాంకేతికత వలన ప్రయాణికుల తనిఖీలు వేగంగా పూర్తవుతాయి, దీని వలన సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
భారత పౌరులలో ఎవరైనా సాధారణ పాస్‌పోర్ట్‌కు అర్హులు అయితే, ఇప్పుడు ఇ-పాస్‌పోర్ట్‌కూ దరఖాస్తు చేయవచ్చు. ప్రస్తుతానికి ఇది దేశంలోని కొద్ది పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSK) మరియు పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (POPSK)లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు, మీ ప్రాంతంలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ సౌకర్యం ఉందో లేదో తప్పక తెలుసుకోవాలి.
ప్రభుత్వం ఈ సదుపాయాన్ని దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికలో ఉంది. తద్వారా కొత్త పాస్‌పోర్ట్‌లు తీసుకునేవారికి, అలాగే రీన్యువల్ చేయించుకునేవారికీ ఈ ఆధునిక సదుపాయం అందుతుంది.
ఇ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు విధానం..
ఇ-పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయడం సాధారణ పాస్‌పోర్ట్ ప్రక్రియలాగే ఉంటుంది. మొదట అధికారిక పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపి, ఫీజు చెల్లించి, సమీప పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
అక్కడ మీ బయోమెట్రిక్ వివరాలు — అంటే వేలిముద్రలు, ఫోటో మొదలైనవి తీసుకుంటారు. తర్వాత ప్రాసెస్ పూర్తైన తర్వాత చిప్ అమర్చిన ఇ-పాస్‌పోర్ట్ మీ చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తారు.
ఇ-పాస్‌పోర్ట్ ప్రయోజనాలు..
ఇ-పాస్‌పోర్ట్ ద్వారా ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుంది. ఇమిగ్రేషన్ చెక్‌లు వేగంగా జరుగుతాయి. అంతర్జాతీయంగా భారత పాస్‌పోర్ట్‌కు మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ముఖ్యంగా, ఇందులో ఉండే చిప్ వలన ఐడెంటిటీ దొంగతనం లేదా డూప్లికేట్ పాస్‌పోర్ట్ తయారీ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.
భారతదేశం స్మార్ట్ మరియు సెక్యూర్ ట్రావెల్ దిశగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో, ఇ-పాస్‌పోర్ట్ ఒక విప్లవాత్మక మార్పు. ఇది భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా సులభమైన, సురక్షితమైన ప్రయాణానికి మార్గం సుగమం చేస్తోంది.