వాషింగ్టన్ నుంచి వస్తున్న వార్తలు అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు మరోసారి షాక్ ఇచ్చాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అత్యంత సులభంగా గ్రీన్ కార్డ్ (Green Card) పొందే అవకాశాన్ని ఇచ్చే యూఎస్ డైవర్సిటీ వీసా (DV) లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకాశం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
అమెరికా ప్రభుత్వం ఏటా అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏటా 50 వేల మంది లోపు అమెరికాకు వలసవచ్చే దేశాల దరఖాస్తుదారులను మాత్రమే ఈ లాటరీకి ఎంచుకుంటారు. గత ఐదేళ్లలో అమెరికాకు ఎక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను దీని నుంచి మినహాయిస్తారు.
భారతీయులకు ఈ లాటరీలో అవకాశం లేకపోవడానికి ప్రధాన కారణం – భారత్ నుంచి అధిక వలసలు ఉండటమే. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు వస్తున్న వలసదారుల సంఖ్య, ఈ వీసా కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమితిని మించిపోయింది. అందువల్లే భారతీయులకు ఈ లాటరీలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వట్లేదని అధికారులు పేర్కొన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... 2021లో, 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వచ్చారు. 2022లో ఈ సంఖ్య ఏకంగా 1,27,010గా ఉంది. ఈ సంఖ్య దక్షిణ అమెరికన్, ఆఫ్రికన్, యూరోపియన్ వలసదారుల సంఖ్య కంటే ఎక్కువ. 2023లో కూడా 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వచ్చారు.
ఈ రికార్డుల ఆధారంగా చూస్తే, 2028 వరకు భారతీయులను యూఎస్ డైవర్సిటీ వీసా లాటరీలకు అనర్హులుగా నిర్ణయించారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానంలో అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది నిజంగా మరో ఎదురుదెబ్బ. భారత్తో పాటు 2026 వరకు ఈ లాటరీకి అర్హత సాధించని ఇతర దేశాల్లో చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి.
వీసా లాటరీలో అవకాశం లేకపోవడం ఒక సమస్య అయితే, తాజాగా అమెరికా ప్రభుత్వం మరో ఆర్థిక భారాన్ని మోపింది. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (USCIS) తాజాగా పెరోల్ ఫీజు (Parole Fee)పై నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని రకాల వలసదారులకు అవసరమయ్యే పెరోల్ ఫీజును 1,000 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మన భారతీయ కరెన్సీలో ఇది సుమారు లక్ష రూపాయలకు పైనే ఉంటుంది.
వీసా లేదా ఇతర అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించడానికి, ఉండటానికి పెరోల్ అనేది ఇచ్చే ఒక తాత్కాలిక అనుమతి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిపై విదేశీయులను అమెరికాలోకి అనుమతిస్తారు.
ఇటీవల ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ పెరోల్ ఫీజును తప్పనిసరి చేశారు. దీని ఆధారంగా అమెరికాలోకి ప్రవేశించాలంటే, విదేశీయులు 1,000 డాలర్ల పెరోల్ రుసుమును చెల్లించాలి.
ఈ రుసుము ఇప్పటికే ఉన్న ఇతర ఇమిగ్రేషన్ సర్వీస్ ఫైలింగ్ లేదా బయోమెట్రిక్ రుసుముకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ అధికారులు సూచించిన సమయం లోపు ఈ రుసుమును చెల్లిస్తేనే పెరోల్ పొందడానికి అనుమతినిస్తారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు అమెరికాలో ఉద్యోగాలు లేదా స్థిరనివాసం కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు రానున్న రోజుల్లో మరింత సమస్యగా మారే అవకాశం ఉంది.