ఇండిగో ఎయిర్‌లైన్స్ చిన్న పిల్లల తల్లిదండ్రుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించే సమయంలో పసిపిల్లల టికెట్ ధర కేవలం ఒక్క రూపాయి మాత్రమే. ఈ ప్రత్యేక ఆఫర్ “Infants Fly at ₹1” పేరుతో నవంబర్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు వచ్చే ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో ఇండిగో ఈ పథకాన్ని ప్రారంభించింది.
0 నుండి 24 నెలల వయస్సు ఉన్న పిల్లలకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. తల్లిదండ్రులు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ goIndiGo.in ద్వారా టికెట్లు బుక్ చేయాలి. చెక్-ఇన్ సమయంలో పిల్లల వయస్సు నిర్ధారించే పత్రాలు — జనన సర్టిఫికేట్, ఆసుపత్రి డిశ్చార్జ్ కార్డ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ చూపించాల్సి ఉంటుంది. సరైన పత్రాలు లేకపోతే టికెట్ పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఇండిగో అధికారిక ప్రకటన ప్రకారం, “పసి పిల్లలతో ప్రయాణించడం చాలా కష్టమైన పని. అందుకే తల్లిదండ్రులకు మేము సౌకర్యాలు కల్పిస్తున్నాం” అని తెలిపింది. 3 రోజుల వయస్సు నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలు ‘ఇన్ఫాంట్’ కేటగిరీలో ప్రయాణించవచ్చు. అయితే ఒక్క పెద్ద వ్యక్తితో ఒక పిల్లవాడు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది.
విమానాల పరిమితుల ప్రకారం, Airbus A320 ఫ్లైట్లలో గరిష్టంగా 12 మంది పసిపిల్లలు, ATR విమానాల్లో గరిష్టంగా 6 మంది పిల్లలు మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. ఈ ఆఫర్ దేశీయ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. పూర్తి వివరాలు, నిబంధనల కోసం ఇండిగో వెబ్‌సైట్‌లోని “Deals & Offers” విభాగాన్ని చూడవచ్చు.
ఈ ఆఫర్ తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనంగా భావిస్తున్నారు. సాధారణంగా పిల్లల టికెట్లకే భారీ ఖర్చు అవుతుంటుంది. కానీ ఇండిగో ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ వల్ల కుటుంబాలు తమ పిల్లలతో సులభంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించగలవు. దీని ద్వారా ఇండిగో తన కస్టమర్ బేస్‌ను పెంచుకోవడమే కాకుండా ప్రయాణికుల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది.