Karthika Pournami: తెలుగు పంచాంగంలో కార్తీక మాసం అనేది భక్తి, ఆచారాల సమ్మేళనం. దీపాల కాంతులు, శివ నామ స్మరణలు, పుణ్యస్నానాలతో ప్రతి ఇల్లు ఆలయంగా మారుతుంది. ఈ మాసానికి ముగింపు సూచించే కార్తీక పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు శివుడు, విష్ణువు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత కలిగిన దినమని పండితులు చెబుతున్నారు.
పౌర్ణమి తిథి వివరాలు
2025లో కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై, నవంబర్ 5 సాయంత్రం 6.48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీ నే కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ఆ రోజున చేయాల్సిన పూజలు
కార్తీక పౌర్ణమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేయడం అత్యంత శ్రేయస్కరం. నది స్నానం సాధ్యమైతే మంచిది, లేకపోతే ఇంట్లోనే చల్లటి నీటితో స్నానం చేసి తులసి దీపం లేదా ఉసిరి దీపం వెలిగించాలి.
365 వత్తులతో దీపారాధన చేయడం ఈ రోజుకు ప్రత్యేకత. ఆ తర్వాత భోళేశంకరుడికి, శ్రీమహావిష్ణువుకి పూజలు చేయడం ద్వారా సకల పాపాలు నశించి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పండితుల ప్రకారం పూజకు అనుకూల సమయం ఉదయం 7.58 నుంచి 9.00 గంటల వరకు సాయంత్రం దీపారాధనకు 5.15 నుంచి 7.05 గంటల వరకు. ఈ సమయంలో పూజలు చేస్తే ఫలితం మరింత శ్రేయస్కరమని చెబుతున్నారు.
ఈ రోజు కార్తీక నోములు ఆచరించడం కార్తీక పురాణం పారాయణం చేయడం ద్వారా భక్తికి మరింత బలం చేకూరుతుంది. అనేక ఆలయాలు రుద్రాభిషేకాలు, లక్ష బిల్వదళ పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు నిర్వహిస్తాయి. వనభోజనాలు, దీపాల ప్రవాహాలు కూడా ఈ రోజునే పెద్ద ఎత్తున జరుగుతాయి.
కార్తీక సోమవారాల తేదీలు
తొలి సోమవారం – అక్టోబర్ 27
రెండో సోమవారం – నవంబర్ 3
మూడో సోమవారం – నవంబర్ 10
నాలుగో సోమవారం – నవంబర్ 17
ఈ పండుగ శాస్త్ర విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. భక్తి, పూజా విధానాలు ప్రాంతానుసారం మారవచ్చు. ముఖ్యమైనది భక్తితో విశ్వాసంతో చేసే ఆరాధన.