కాల్పుల విరమణ తర్వాత హర్మూజ్ దాటిన భారత నౌక..
ఉద్రిక్తతల తర్వాత సముద్ర మార్గంలో ఊరట..
అమెరికా–ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సముద్ర రవాణా కార్యకలాపాల పునరుద్ధరణ క్రమంగా జరుగుతుంది. ఈ పరిణామంలో భాగంగా, హర్మూజ్ జలసంధి ను సురక్షితంగా దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌గా ‘జగ్ విక్రమ్’ ప్రత్యేక గుర్తింపు పొందింది.
గల్ఫ్ ప్రాంతం నుంచి భారీ ఎల్పీజీ సరుకుతో బయల్దేరిన ఈ నౌక, ఇటీవలి ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాఫీగా ప్రయాణాన్ని కొనసాగించడం విశేషంగా నిలిచింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హర్మూజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగింది.
జలసంధిని విజయవంతంగా దాటిన అనంతరం, ఈ ట్యాంకర్ మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించింది. ఈ ప్రయాణం సురక్షితంగా కొనసాగడం, అంతర్జాతీయ సముద్ర మార్గాలు మళ్లీ సురక్షితం అనే సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
ఈ సంఘటన భారత ఇంధన సరఫరా వ్యవస్థకు కూడా ఊరట కలిగించనుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గంలో మళ్లీ విశ్వాసం పెరుగుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.