సాధారణంగా ప్రతి ఇంట్లో ఉదయం టిఫిన్ లేదా రాత్రి భోజనంలో చపాతీ అనేది ఒక భాగమైపోయింది. అయితే, చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే.. చపాతీలు చేసిన కొద్దిసేపటికే గట్టిగా మారిపోవడం లేదా వాటిని ఒక్కొక్కటిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టడం. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ చపాతీలను పొరలు పొరలుగా, అత్యంత మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మెత్తటి చపాతీల కోసం పిండి కలిపే విధానమే అత్యంత ముఖ్యం. రెండు కప్పుల గోధుమ పిండికి తగినంత ఉప్పుతో పాటు, రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగును కలపడం ఇక్కడ అసలైన చిట్కా. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ గోధుమ పిండిని మృదువుగా మార్చడమే కాకుండా, చపాతీలు ఎక్కువ సేపు సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది. పిండిని కలిపేటప్పుడు ఒక్కసారిగా నీళ్లు పోయకుండా, వేళ్లతో మెల్లగా కలుపుతూ, ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఒత్తిడిని ఇస్తూ మర్దనా చేయాలి. పిండి పైన ఎక్కడా పగుళ్లు లేకుండా నునుపుగా వచ్చే వరకు కలిపి, కనీసం ఐదు నిమిషాల పాటు విశ్రాంతినివ్వాలి.
సాధారణంగా మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీలు పాముతాము. కానీ సమయం ఆదా కావాలంటే, ఒక పెద్ద పిండి ముద్దను తీసుకుని పెద్ద రొట్టెలా చేసుకోవాలి. దీనిపై చేతి వేళ్లతో అక్కడక్కడా చిన్న గుంతలు చేసి, నూనెను అప్లై చేయాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ పొరలు పొరలుగా మడత పెట్టాలి ఇలా మడత పెట్టిన పిండిని సమాన భాగాలుగా కట్ చేసుకుంటే, ఒక్కో భాగంలో అనేక లేయర్లు సహజంగానే ఏర్పడతాయి. ఈ పద్ధతి ద్వారా ఐదు నుండి ఆరు చపాతీలను ఒకేసారి సిద్ధం చేసుకోవచ్చు.
చపాతీలను కాల్చేటప్పుడు పెనం బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్ మీద వేసిన తర్వాత చిన్న బుడగలు రాగానే తిప్పి, అంచుల వెంబడి అట్లకాడతో నొక్కుతూ కాల్చాలి. ఇలా చేయడం వల్ల లోపలి వరకు సమానంగా ఉడుకుతాయి. అర టీస్పూన్ నూనెతో రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే, వేడి వేడి లేయర్ చపాతీలు సిద్ధమవుతాయి.
నూనె ఇష్టపడని వారు చిన్న పిండి ముద్దను తీసుకుని పల్చగా రుద్దుకోవాలి. పెనంపై వేసి లైట్‌గా బబుల్స్ రాగానే నేరుగా మంటపై వేయాలి. ఇలా చేయడం వల్ల పుల్కా బంతిలా పొంగుతుంది. ఇది కేవలం రుచికరమే కాకుండా, జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.ఈ చిట్కాలను పాటిస్తే వంటగదిలో గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం ఉండదు. హోటల్ స్టైల్ లో సాఫ్ట్ చపాతీలను మీ ఇంట్లోనే రుచి చూడవచ్చు.