అమరావతి వందశాతం సెల్ఫ్ సస్టెయినబుల్ సిటీ..
మావిగన్ పేరు వింటేనే జనం నవ్వుకుంటున్నారు..
విజయవాడ: అమరావతి రాజధాని అంశంపై వైసీపీ తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను వివరించారు.
అమరావతిపై అవినీతి జరుగుతోందని చెప్పడం పూర్తిగా అసత్యమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంట్ భవనాల నిర్మాణ ఖర్చులతో పోల్చి చూస్తే అమరావతిలో నిర్మాణ వ్యయం సహజంగానే ఉందని వివరించారు. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి సుమారు ₹1,423 కోట్లు ఖర్చై చదరపు అడుగుకు ₹13,763 వ్యయం అయ్యిందని, అలాగే పార్లమెంట్ భవనానికి ₹1,174 కోట్లు ఖర్చై చదరపు అడుగుకు ₹16,916 వ్యయం అయ్యిందని చెప్పారు.
అయితే అమరావతిలో కేవలం భవనాలు మాత్రమే కాకుండా రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ లైన్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కలిపి నిర్మాణం జరుగుతుండటంతో ఖర్చు ఎక్కువగా కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాజధాని గురించి మాట్లాడుతున్నారని, గతంలో అసెంబ్లీలో గుంటూరు–విజయవాడ రాజధానిని అంగీకరించిన వారు, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల మాట తీసుకువచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించారు. రైతులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
అమరావతిని కదిలించలేమని తెలుసుకుని ‘మావిగన్’ పేరుతో కొత్త గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పేరును వింటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
నిర్మాణ వ్యయం పెరగడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని మంత్రి తెలిపారు. అప్పట్లో జీఎస్టీ 12% ఉండగా ఇప్పుడు 18%కి పెరిగిందని, బిటుమెన్, స్టీల్, మెటల్ ధరలు గణనీయంగా పెరిగినట్లు వివరించారు. టెండర్లు అన్నీ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పారదర్శకంగా ఆన్లైన్లోనే పిలుస్తున్నామని చెప్పారు.
అమరావతిలో ఒకే వర్గానికి కాంట్రాక్టులు ఇచ్చారన్న ఆరోపణలు కూడా అసత్యమని, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు.
రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో పెద్ద ఎత్తున పురోగతి సాధించామని తెలిపారు. మొత్తం 31,158 మంది రైతుల్లో 30,074 మందికి ప్లాట్లు కేటాయించామని, 62,942 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందని చెప్పారు.
అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాలు దాదాపు పూర్తి అయ్యాయని, మరికొన్ని భవనాలు త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తవుతుందని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.
అమరావతిని సెల్ఫ్ సస్టెయినబుల్ సిటీగా రూపకల్పన చేశామని, భవిష్యత్తులో భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చగలమని, ప్రజలపై పన్నుల భారం వేయబోమని హామీ ఇచ్చారు.
చివరగా, “చంద్రబాబుకు విజన్ ఉంది… జగన్ మాత్రం విషం పంచుతున్నారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నారాయణ. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు.