‘కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు’ నిర్వహణకు ప్రభుత్వం కట్టుబాటు..
గోదావరి కాలుష్యంపై బోటులో పర్యటించి స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్..
రాబోయే గోదావరి పుష్కరాలను “కాలుష్యరహిత గోదావరి” లక్ష్యంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గోదావరిలో కలిసే కాలుష్య జలాలపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించి, సమస్య ఎక్కడుందో గుర్తించి శాశ్వత పరిష్కారాలతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీరం వెంట ఉన్న కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, గోదావరి గట్ల సుందరీకరణ, కాలుష్య నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు.
చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా మురుగు నీరు గోదావరిలోకి చేరుతున్న ప్రాంతాన్ని ఆయన దగ్గరగా పరిశీలించారు. అక్కడే వ్యర్థ జలాలను ఎలా శుద్ధి చేస్తున్నారో తెలుసుకుని, సిబ్బందితో మాట్లాడారు. వ్యర్థాలను వేరు చేసే విధానం, శుద్ధి ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రోజుకు సుమారు 55 మిలియన్ లీటర్ల మురుగు నీరు గోదావరిలోకి చేరుతోందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ మురుగు నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి మాత్రమే నదిలోకి విడుదల చేయాలని సూచించారు. నేరుగా మురుగు నీటిని వదలడం వల్ల గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కాలుష్య సమస్యపై నిజాయతీగా పూర్తి స్థాయి ఆడిట్ చేసి, ఆ తర్వాత స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. కేవలం లెక్కలతో కాకుండా, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు.
కేంద్ర జల శక్తి శాఖ ద్వారా ఎన్‌ఆర్‌సీపీ కింద రూ.416 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికే రూ.95 కోట్లకు పరిపాలన అనుమతులు వచ్చాయని తెలిపారు. ఈ నిధులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని, పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన నీటినే గోదావరిలోకి విడుదల చేసే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాల అంశంపైనా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ప్రస్తుతం వ్యర్థాలను లంక ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారని అధికారులు వివరించగా, దీనికి త్వరగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త శుద్ధి కేంద్రం నిర్మాణం వేగవంతం చేయాలని, అప్పటివరకు తాత్కాలికంగా మరింత సమర్థవంతమైన శుద్ధి వ్యవస్థ ఏర్పాటు చేయాలని కంపెనీ యాజమాన్యానికి సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
బోటు ప్రయాణం నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునే వరకు పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్య నివారణ చర్యలపై అధికారులను వరుసగా ప్రశ్నిస్తూ వివరాలు తెలుసుకున్నారు. ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద వ్యర్థాల నిర్వహణ, శుద్ధి విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. కొత్త సాంకేతిక పద్ధతులను అనుసరించి ఎప్పటికప్పుడు వ్యవస్థను నవీకరించుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.