జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్లో మృతి చెందగా, ఆయన మృతదేహం అక్కడి అతిశీతల శవాగారంలో ఇప్పటివరకు నిల్వ ఉంది. మృతదేహాన్ని భారతదేశానికి తరలించడం సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాదని బహరేన్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది.
దీంతో బహరేన్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) పై సంతకం చేశారు. తదుపరి చర్యల కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యాలయాన్ని సందర్శించి, మృతుని సోదరుడు ధర్మపురి ఆనంద్ తో కలిసి అఫిడవిట్ పత్రాన్ని ప్రజావాణి ఇన్చార్జి డా. జి. చిన్నారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, “బహరేన్లోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేసుకొని, అక్కడే సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అన్నారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహరేన్కి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.