మన భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని వృథా చేయకూడదు అనేది ఒక బలమైన నమ్మకం. మనలో చాలా మంది ఫుడ్ వేస్ట్ అస్సలు చేయరు. కూర మిగిలినా, చపాతీ మిగిలినా, ముఖ్యంగా అన్నం మిగిలినా దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వండుకుని లేదా కలుపుకుని తింటుంటారు. ఉదయం మిగిలిన అన్నాన్ని రాత్రిపూట, రాత్రిమిగిలిన అన్నాన్ని ఉదయం పూట తినడం చాలా ఇళ్లలో సర్వసాధారణం.
అయితే, ఈ మిగిలిపోయిన అన్నాన్ని తినడం మంచిదేనా? దీనివల్ల ఆరోగ్యానికి ఏమైనా సమస్యలు వస్తాయా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిపుణుల ప్రకారం, మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అదే సమయంలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
మిగిలిన అన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…
మిగిలిన అన్నాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేస్తే, దాని వల్ల మన శరీరానికి కొన్ని అదనపు ప్రయోజనాలు కలుగుతాయి.
1. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది (పెరుగు అన్నం)
మిగిలిన అన్నాన్ని పెరుగులో కలుపుకుని (పెరుగు అన్నంగా) తింటే జీర్ణక్రియ (Digestion) చాలా మెరుగుపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. చల్లటి అన్నంతో కలిసినప్పుడు, ఇది మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే, కడుపు సమస్యలను, అజీర్ణాన్ని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
2. రెసిస్టెంట్ స్టార్చ్ (Resistant Starch) పెరుగుదల…
ఇదే ఈ అన్నంలో ఉండే కీలకమైన ఆరోగ్య రహస్యం. అన్నం చల్లబడినప్పుడు, అందులో ఒక ప్రత్యేకరకమైన పిండి పదార్థం ఏర్పడుతుంది. దీనినే రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. ఈ పిండి పదార్థం మన శరీరంలో జీర్ణం కాదు. కానీ, ఇది పేగుల్లోకి వెళ్లి ఫైబర్ (Fiber) మాదిరిగా పనిచేస్తుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ: ఈ రెసిస్టెంట్ స్టార్చ్, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి మిగిలిపోయిన, చల్లగా ఉన్న అన్నం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తారు.
3. శరీర వేడిని తగ్గిస్తుంది..
ముఖ్యంగా ఎండాకాలంలో లేదా శరీర వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన అన్నాన్ని తినడం చాలా మంచిది. చల్లగా ఉన్న అన్నాన్ని లేదా రాత్రంతా పులియబెట్టిన అన్నాన్ని (పాత అన్నం) తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. పులియబెట్టిన అన్నంలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది.
4. శక్తి, బరువు నియంత్రణ..
మిగిలిన అన్నంలో విటమిన్ బి, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. దీన్ని తింటే మన శరీరానికి మంచి శక్తి అందుతుంది. అలాగే, మిగిలిపోయిన అన్నం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది, ఎందుకంటే ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు పదే పదే తినే అవకాశాలు తగ్గిపోతాయి.
మిగిలిపోయిన అన్నం తినడం వల్ల వచ్చే ప్రమాదాలు!
ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మిగిలిన అన్నాన్ని తినేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
1. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల ముప్పు..
ఇదే అతి పెద్ద సమస్య ముడి బియ్యంలో 'బాసిల్లస్ సెరియస్' (Bacillus cereus) అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అన్నం వండినా నాశనం కాదు.
మీరు అన్నాన్ని వండిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద (Room Temperature) చల్లబరిచినప్పుడు ఈ బ్యాక్టీరియా అందులో చాలా వేగంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా విషాన్ని (Toxin) ఉత్పత్తి చేస్తుంది. ఈ విషం అన్నాన్ని తిరిగి వేడి చేసినా కూడా చనిపోదు.
ఫుడ్ పాయిజనింగ్: ఈ బ్యాక్టీరియాతో కలుషితమైన అన్నాన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల వాంతులు, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు అన్నం తిన్న 1 నుంచి 5 గంటల్లో కనిపించవచ్చు.
2. పోషకాల నష్టం, అజీర్తి..
మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదు. దీనివల్ల అన్నంలో ఉన్న కొన్ని నీటిలో కరిగే విటమిన్లు తగ్గుతాయి, ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే, కొంతమందికి మిగిలిన అన్నం తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
ఎక్కువ ప్రమాదం ఎవరికి: ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు!
మిగిలిన అన్నాన్ని తినాలనుకుంటే, ఈ చిన్నపాటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి:
అన్నం వండిన తర్వాత ఒక గంట లోపే దాన్ని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి. గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకండి.
ఫ్రిజ్‌లో పెట్టిన అన్నాన్ని ఒక రోజు లోపే తినేయడం మంచిది. తిరిగి వేడి చేసి తినే బదులు, పెరుగు అన్నంగా, నిమ్మకాయ అన్నంగా లేదా పులియబెట్టి తినడం ఉత్తమం.