భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపినట్లుగా చంద్రయాన్ 2 లూనార్ ఆర్బిటర్ మొదటిసారిగా చంద్రునిపై సూర్యుని కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) ప్రభావాన్ని గుర్తించింది. ఈ CMEలు సూర్య నుంచి వెలువడే భారీ తుఫాన్లు ఇవి చంద్రుని ఉపరితలంలోని వాతావరణ పరిస్థితులను తాత్కాలికంగా మార్చుతాయి.
ఇస్రో వివరాల ప్రకారం CHACE 2 పరికరం ద్వారా ఈ సమాచారం సేకరించబడింది. 2024 మే 10న చంద్రునిపై CME ప్రభావం కనుగొనబడింది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయి కాబట్టి ఈ పరిశీలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తెలిపారు.

CME ప్రభావం వల్ల చంద్రుని బాహ్య వాతావరణం (లూనార్ ఎక్సోస్పియర్)లో పీడనం పెరిగి అక్కడ ఉన్న తటస్థ అణువులు మరియు మాలిక్యూల్స్ సాంద్రతలో అసాధారణంగా మార్పు చోటు చేసుకుంది. ఇది కొంతకాలం చంద్రుని ఉపరితల వాతావరణాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుందని వివరించారు.
భూమి వలే చంద్రునికి రక్షణ ఇచ్చే మాగ్నటిక్ ఫీల్డ్ లేకపోవడం కారణంగా CME ప్రభావం చాలా తీవ్రమైనది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా చిన్న మార్పు కూడా చంద్రుని సున్నితమైన వాతావరణాన్ని గణనీయంగా మార్చగలదు.
ఈ పరిశోధన చంద్రుని వాతావరణం మరియు సూర్య ప్రభావాలపై శాస్త్రీయ అవగాహనను పెంచుతుంది అదేవిధంగా భవిష్యత్ మిషన్ల కోసం CME ప్రభావాలను ముందుగానే అంచనా వేయడం సులభమవుతుంది. ఈ అధ్యయన ఫలితాలు 2025 ఆగస్టు 16న Geophysical Research Letters లో ప్రచురించబడ్డాయి.ఇది చంద్రుని వాతావరణంపై కొత్త శాస్త్రీయ మార్గాలను చూపనుంది.
భవిష్యత్తులో చంద్రునిపై మానవ నివాసాలు అలాగే పరిశోధనా కేంద్రాలు ఏర్పాట్లను పరిశీలించేటప్పుడు సూర్య CMEల ప్రభావాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రభావాలను తట్టుకొని అక్కడ సురక్షితమైన స్థలాలను నిర్మించడలో పెద్ద సవాల్ అవుతుంది అని ఇస్రో అధికారులు అంటున్నారు.