రాష్ట్రంలో పరిశ్రమలకు కొత్త ఊపు.. 23 రంగాల ప్రత్యేక పారిశ్రామిక విధానాలు..
ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం అండగా.. పెట్టుబడులు, రుణాలు సులభతరం..
కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు.
కాకినాడలోని జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఎంఎస్‌ఈ ఎమర్జ్ కార్యక్రమం ద్వారా ఎంఎస్‌ఎంఈలకు పెట్టుబడులు సులభంగా అందేలా చర్యలు చేపట్టామని వివరించారు.
పరిశ్రమల అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 23 సెక్టార్ ఆధారిత పారిశ్రామిక విధానాలను అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పరిశ్రమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోందని తెలిపారు. కొత్త స్టార్టప్‌లు, పరిశ్రమల విస్తరణకు అవసరమైన రుణాలు సులభంగా పొందేలా బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రత్యేక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు క్లస్టర్ అభివృద్ధిపై ఆసక్తి వ్యక్తం చేయగా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి వారికి వివరించారు.
సమావేశంలో మాట్లాడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, గత ప్రభుత్వ హయాంలో వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారాలు నిర్వహించలేకపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల్లో ప్రశాంతత నెలకొందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సభలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలనే ప్రశ్నించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
గత ఐదేళ్లలో మంత్రులు జిల్లాకు వచ్చి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ తన శాఖ పనితీరును నిరంతరం సమీక్షిస్తూ పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
కాకినాడలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా ఫర్నిచర్ ఉత్పత్తి రంగంలో స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని సూచించారు.
సమావేశం ముగింపులో పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అవసరం వచ్చినా ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని, వ్యక్తిగతంగా కూడా సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.