ఈ రోజు జరిగే ఆ సంప్రదాయం ఎందుకు తరతరాలుగా కొనసాగుతోంది!

2026-01-14 07:00:00

సంక్రాంతి పండుగకు ఆరంభంగా జరుపుకునే భోగి పండుగ తెలుగు ప్రజల సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ముందు రోజు అయిన భోగి పండుగను, పాతదాన్ని విడిచిపెట్టి కొత్త జీవనానికి స్వాగతం పలికే ప్రతీకగా భావిస్తారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఆశలు, ఆకాంక్షలతో నూతన ఆరంభానికి సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటారు.

భోగి పండుగకు ప్రధాన ఆకర్షణ భోగి మంటలుమరియు బోగీ పండ్లు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామున గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా భోగి మంటలు వెలిగిస్తారు. పాత పనికిరాని వస్తువులను అగ్నికి ఆహుతి చేయడం ద్వారా పాత అలవాట్లు, బాధలు, నిరాశలను దూరం చేసుకుని, శుభ్రమైన ఆలోచనలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. పెద్దలు, పిల్లలు కలిసి మంటల చుట్టూ తిరుగుతూ శుభాకాంక్షలు చెప్పుకోవడం సంప్రదాయం. అలాగే చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు. పిల్లల ఆయురారోగ్యాల కోసం ఇలా చేస్తారని అందరూ నమ్ముతారు.

భోగి సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి, ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను అలంకరించడం మరో విశేషం. మహిళలు ప్రత్యేకంగా గొబ్బెమ్మలతో ఇంటి ముందు ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తారు. రైతులకు ఇది పంటలు చేతికొచ్చిన ఆనందాన్ని పంచుకునే పండుగగా కూడా నిలుస్తుంది. కొత్త బియ్యం, చెరకు, నువ్వులతో చేసిన వంటకాలు భోగి నాడు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భోగి విభిన్న పేర్లతో, విధానాలతో జరుపుకుంటారు. తమిళనాడులో దీనిని భోగి పొంగల్‌గా పిలుస్తూ, ఇళ్ల ముందు మంటలు వేసి పాత వస్తువులను తొలగిస్తారు. కర్ణాటకలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భోగిని జరుపుకుంటారు. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో లోహ్రీ పండుగగా దీనిని నిర్వహిస్తారు. ప్రతి ప్రాంతంలో విధానం మారినా, పాతదాన్ని వదిలి కొత్తదాన్ని ఆహ్వానించాలనే భావన మాత్రం ఒకటే.

భోగి పండుగ మనకు శుభ్రత, ఐక్యత, ఆశావాదాన్ని నేర్పుతుంది. కుటుంబ సభ్యులు, పొరుగువారు కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకోవడం ద్వారా సామాజిక బంధాలు మరింత బలపడతాయి. వ్యవసాయం, ప్రకృతి, సంప్రదాయాల పట్ల మనకు ఉన్న కృతజ్ఞతను గుర్తు చేస్తూ, భోగి తెలుగు సంస్కృతిలో ఆనందం, ఆత్మీయత నింపే పండుగగా నిలుస్తోంది.

మీకూ మీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రవాసి తరపున భోగి పండుగ శుభాకాంక్షలు.

Spotlight

Read More →