తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు సమావేశాలు..
తానా ప్రపంచసాహిత్య వేదిక 90వ సమావేశం..
తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో గత ఐదున్నర సంవత్సరాలుగా ప్రతి నెలా నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” అంతర్జాల సమావేశాలు తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం జరిగిన 90వ సమావేశం “తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఎవరు ఏమి చేస్తున్నారు?” అనే ముఖ్యాంశంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ కవి ఆలూరి బైరాగి రచనలపై సమగ్రంగా మాట్లాడారు. బైరాగి రచనల్లో ఉన్న సామాజిక స్పృహ, మానవతా విలువలను విశ్లేషిస్తూ ఆయన సాహిత్యాన్ని పుస్తక రూపంలో, అలాగే ఈ-బుక్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ శరత్ చంద్ర (ఆర్.డి విల్సన్) మాట్లాడుతూ, ఒకప్పుడు విస్తృతంగా పాఠకాదరణ పొందిన వారపత్రికలు, మాసపత్రికలు క్రమంగా కనుమరుగవుతున్న పరిస్థితిని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ‘ఉషా గ్రూప్ ఆఫ్ మాగజైన్స్’ ద్వారా అచ్చు, డిజిటల్ రూపాల్లో పత్రికలను కొనసాగించడం ఆర్థికంగా భారమైనప్పటికీ, ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ‘ఉషా బాల’ పత్రికను కూడా నిర్వహిస్తున్నామని వివరించారు.
తానా ప్రపంచసాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, మాతృభాషను పరిపాలనా భాషగా అమలు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించడం కూడా సమానంగా ముఖ్యమని అన్నారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుగు కోసం కృషి చేస్తున్న వారి సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న పలువురు తమ తమ మాధ్యమాల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు.
“అజగవ” సాహితీ ఛానల్ నిర్వాహకులు రాజన్ పి.టి.ఎస్.కె
“దాసుభాషితం” పాడ్కాస్ట్ నిర్వాహకులు దాసు కిరణ్
“పద్య పరిమళం” యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు పాతూరి కొండల్ రెడ్డి
వికీమీడియా ద్వారా తెలుగు సమాచారాన్ని అందిస్తున్న సూరంపూడి పవన్ సంతోష్
“సారంగ” అంతర్జాల పత్రిక నిర్వాహకురాలు కల్పన రెంటాల
“ఈమాట” పత్రిక నిర్వాహకులు సురేష్ కొలిచాల
“శ్రీ కౌముది” వెబ్ మాసపత్రిక, “కిరణ్ ప్రభ” రేడియో టాక్ షో హోస్ట్ కిరణ్ ప్రభ
“నెచ్చెలి” వనితా మాసపత్రిక నిర్వాహకురాలు డా. కె. గీత
వీరు అందరూ తమ అనుభవాలను ఉదాహరణలతో పంచుకుంటూ, తెలుగు భాషను ఆధునిక మాధ్యమాల ద్వారా ఎలా విస్తరిస్తున్నారో వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.
కార్యక్రమం ముగింపులో సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో పాల్గొన్న అతిథుల కృషి ప్రశంసనీయం అని అన్నారు. కార్యక్రమ నిర్వహణలో సహకరించిన తానా సభ్యులకు, ప్రసార మాధ్యమాలకు, అతిథులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ 90వ సమావేశం మరోసారి తెలుగు భాష, సాహిత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని వెలుగులోకి తీసుకువచ్చింది.