గల్ఫ్ ఏజెంట్ల మోసం, వేధింపులు.. ఎన్ఆర్ఐ టీడీపీ, ఎంబసీ చొరవతో బయటపడ్డ సఖినేటిపల్లి మహిళ.
సంకెళ్లు తెంచుకుని బిడ్డల చెంతకు.. ఒమన్ బాధితురాలికి అండగా నిలిచిన ఏపీ ఎన్నార్టీ, టీడీపీ ఎన్ఆర్ఐ సెల్.
APNRT: సఖినేటిపల్లి మండలానికి చెందిన ఎరసాని సంపూర్ణ, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల రిత్య తన పిల్లలను పోషించుకోవడానికి మస్కట్ వెళ్లారు. అయితే అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ రవి కుమార్ ఆమెను కృష్ణవేణి అనే లోకల్ ఏజెంట్‌కు అప్పగించగా, అక్కడ ఆమెకు సరైన జీతం ఇవ్వకుండా, పలు ఇళ్లల్లో పని చేయిస్తూ తీవ్రంగా వేధించారు. తిరిగి ఇండియాకు పంపించాలంటే లక్ష రూపాయలు స్పాన్సర్ కి చెల్లించాలని చెప్పారు.
సాధారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు రెండు ఏళ్ల అగ్రిమెంట్‌పై వెళ్తారు. ఒకవేళ అక్కడ పని నచ్చకపోయినా, ఆరోగ్యం బాగోలేకపోయినా నిర్దిష్ట సమయం లోపే తిరిగి వచ్చేయాలంటే అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మనల్ని తీసుకువచ్చిన యజమాని మన వీసా, అకామా (రెసిడెంట్ పర్మిట్) కోసం పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించాలి అని చట్టం చెప్తుంది. ఆ ఖర్చు సుమారు లక్ష నుండి లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. ఆ డబ్బు కడితేనే అక్కడ కోర్టులో కూడా అనుమతి ఇచ్చి వారికి పాస్‌పోర్ట్ తో పాటు ఎగ్జిట్ పర్మిట్ కు అనుమతి ఇచ్చి ఇండియాకు పంపిస్తారు. సంపూర్ణ విషయంలో కూడా ఇదే నిబంధన అడ్డుపడింది.
డబ్బు కట్టే స్తోమత లేక ఆమె ఇండియన్ ఎంబసీని ఆశ్రయించగా, అక్కడ కూడా పాత యజమానికి లక్ష రూపాయలు చెల్లించాలనే నిబంధన ఎదురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊరి ఎంపిటిసి సహాయంతో ఏజెంట్ రవికుమార్‌కు లక్ష రూపాయలు చెల్లించారు. కానీ, ఆ ఏజెంట్ ఫోన్ ఎత్తకుండా మోసం చేశాడు. చేసేదేమీ లేక సంపూర్ణ కుటుంబ సభ్యులు పోలీసులకు మరియు తెలుగుదేశం పార్టీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ కు ఫిర్యాదు చేశారు. సంపూర్ణను ఎలాగైనా న్యాయం చేసి, అక్కడ ఎంబసీ వారితో సంప్రదింపులు జరిపి త్వరగా ఆమెను తీసుకు రావాల్సిందిగా ఒమాన్ లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిదులు బొంతు నాగరాజు, మహమ్మద్ ఇమామ్, సత్య శ్రీధర్, వాసు బాబు, రాఘవేంద్ర, R. శ్రీనివాస్ మరియు రాజేష్ తెలిపారు .
ఒమన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు, ఒమాన్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు అంతా ఒక్కటై సంపూర్ణకు భరోసా ఇచ్చారు. యజమానికి చెల్లించాల్సిన లక్ష రూపాయల ఖర్చును వీరంతా కలిసి భరించి, ఆమెను సురక్షితంగా ఎంబసీ షెల్టర్‌కు చేర్చారు. ఆ తర్వాత జిఎంకే ట్రావెల్ ట్రస్ట్‌కు చెందిన గుత్తుల మీనా కుమార్ గారు విమాన టిక్కెట్ ఖర్చు భరించగా, వెలుగొట్ల అశోక్ కుమార్ గారు హైదరాబాద్ నుండి నరసాపురం వరకు బస్సు టికెట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాసెస్ అంతా దాదాపు పది నెలలు సమయం తీసుకుంది. అప్పటివరకు భారత ఎంబసీ అధికారులు ఎంతో సహకారం అందించారు.
సుమారు ఈ పది నెలల కఠిన పోరాటం తర్వాత ఈ మార్చి 30వ తేదీన సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ లోని సఖినేటిపల్లి లో ఉన్న తన బిడ్డల వద్దకు సురక్షితంగా చేరుకున్నారు. తన కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంబసీ అధికారులతో పాటు ఒమన్ ఎన్నారై టిడిపి సభ్యులకు, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి, తన పూర్తి సహకారం అందించిన ఏపీ ఎన్నార్టీ అధికారులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మొదట నుండి తనకు కష్ట కాలంలో ఉన్న సమయంలో టైం టు టైం టచ్ లో ఉండి ధైర్యం చెబుతూ అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అండదండలు అందించిన బొంతు నాగరాజు, టికెట్ అందించిన గుత్తుల మీనా కుమార్, అంబేద్కర్ కోన సీమ జిల్లా కలెక్టర్ గారికి, బస్ టికెట్ అందించిన వెలిగోట్ల అశోక్ కుమార్, పోలీసు అధికారులందరికీ సంపూర్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గల్ఫ్ దేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లే వారికి సూచన:
ఇలా గల్ఫ్ దేశాలకు ఉద్యోగ అవకాశాలకు వెళ్లి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే విదేశాలకు వెళ్లే వారు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలి మరియు అక్కడి వీసా నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఏదైనా ఆపద కలిగినప్పుడు లేనిచో ఆయా దేశాలకు వెళ్లాలని సిద్ధపడినప్పుడు తప్పకుండా వెంటనే ఆయా దేశాలలోని భారత ఎంబసీ అధికారులను లేదా ఏపీ ఎన్నార్టీ (APNRTS) సంస్థను లేదా ఎన్ఆర్ఐ టిడిపి కోఆర్డినేటర్స్ / సభ్యులను లేదా మీకు అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులను సంప్రదించడం ద్వారా తగిన సహాయం పొందవచ్చు. అదేవిధంగా తప్పనిసరిగా మీయొక్క స్పాన్సర్ లేదా యజమాని లేదా కంపెనీ వివరాలు మరియు అత్యవసర ఫోన్ నంబర్లను ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా వెనుకాడకుండా తప్పకుండా పైన తెలిపిన అధికారులను సంప్రదించ వలసిందిగా ఆంధ్ర ప్రవాసి తరపున సూచిస్తున్నాము.