ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంక్రాంతి పండుగ వేళ శుభవార్త అందించింది. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.9,789 కోట్లను నేరుగా జమ చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అన్నదాతకు భరోసా కల్పించేలా అనేక నిర్ణయాలు అమలు చేస్తున్నామని మంత్రి మనోహర్ వెల్లడించారు. రైతులకు నిజమైన పండుగ ఆనందం తమ ప్రభుత్వ హయాంలోనే కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు మంత్రి వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన మొత్తం విలువ రూ.9,789 కోట్లు అవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు తమ ధాన్యం విక్రయించిన కేవలం 4 గంటల వ్యవధిలోనే డబ్బు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు అని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు నెలల తరబడి ఖాతాల్లోకి రాకుండా రైతులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. మధ్యవర్తులు, దళారులు రైతుల కష్టాన్ని దోచుకునే వ్యవస్థకు తమ ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. గిట్టుబాటు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో మొత్తం రూ.10 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు.
ప్రాంతాల వారీగా కూడా ధాన్యం సేకరణ గణనీయంగా జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 98 శాతం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, కాకినాడ జిల్లాలో 97 శాతం మేర సేకరణ పూర్తయినట్లు వివరించారు. ఇక ముందుగా ప్రకటించినట్లే వచ్చే నెలలో ‘అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. పీఎం కిసాన్ 22వ విడత నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాయం కలిసివచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ చర్యలతో రైతుల ఆర్థిక భద్రత మరింత బలపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.