డేటా సెక్యూరిటీ పరంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇటీవల భారీ స్థాయిలో జరిగిన డేటా లీక్ ఘటనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్వర్డ్లు లీక్ అయ్యాయని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ వెల్లడించారు. ఈ ఘటనను ఆయన తన వెబ్సైట్ “Have I Been Pwned”లో ధృవీకరించారు. ఈ లీక్‌లో గూగుల్ Gmail ఖాతాలు, Outlook, Yahoo, ProtonMail, iCloud వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌ల యూజర్ వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ట్రాయ్ హంట్ వివరణ ప్రకారం, ఈ డేటా ఒకే సారి దొంగతనానికి గురైనది కాదు. గత కొన్ని నెలలుగా అనేక మాల్వేర్ దాడుల ద్వారా వేర్వేరు కంప్యూటర్ల నుంచి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు, బ్రౌజింగ్ డేటా, కుకీలు, బ్యాంకింగ్ వివరాలు మొదలైనవి దొంగిలించబడ్డాయి. ఈ సమాచారాన్ని హ్యాకర్లు కలిపి, మొత్తం 3.5 టెరాబైట్ల డేటాగా (సుమారు 875 HD సినిమాలకు సమానం) రూపొందించారు. ఈ డేటా ఇప్పుడు డార్క్ వెబ్‌లో కొనుగోలు, విక్రయాలకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
ఇక, అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే – ఈ లీక్‌లో గూగుల్ ఖాతాల వివరాలు కూడా ఉన్నాయని ధృవీకరణ వచ్చింది. అంటే, గూగుల్ డ్రైవ్‌లో ఉన్న ఫైళ్లు, జీమెయిల్ ద్వారా జరిపే కమ్యూనికేషన్, యూట్యూబ్ లాగిన్ వివరాలు వంటి వాటి సెక్యూరిటీకి ముప్పు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రాయ్ హంట్ సూచన ప్రకారం, యూజర్లు తమ ఖాతాలు లీక్ అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే ఆయన సైట్ haveibeenpwned.com ను సందర్శించి తమ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఫలితంగా, ఆ ఈమెయిల్ ఏదైనా డేటా లీక్‌లో ఉందో లేదో వివరాలు తెలుస్తాయి.
అదే విధంగా, మీ ఖాతా సురక్షితంగా ఉండాలంటే వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలి, అదే పాస్‌వర్డ్‌ను ఇతర వెబ్సైట్లలో ఉపయోగించకూడదు. Two-Factor Authentication (2FA) ప్రారంభించడం ద్వారా అదనపు రక్షణ పొందవచ్చు.
ఇక కంపెనీలు కూడా సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాళ్లు కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మాల్వేర్ అటాక్స్, ఫిషింగ్ ఇమెయిల్స్ ద్వారా హ్యాకర్లు నిరంతరం కొత్త పద్ధతులతో యూజర్లను మోసం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో సైబర్ అవగాహన చాలా అవసరమని పేర్కొన్నారు.
ఈ లీక్ ఘటనతో మరోసారి స్పష్టమైంది ఏమిటంటే డిజిటల్ ప్రపంచంలో నిర్లక్ష్యం ఒక్క క్షణం కూడా ప్రమాదకరం. పాస్‌వర్డ్‌లను తరచూ మార్చటం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకపోవటం, సురక్షితమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వినియోగం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, ఈ భారీ డేటా లీక్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లను అప్రమత్తం చేసింది. ఇప్పుడే మీ ఖాతా సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయండి లేకపోతే ఆలస్యం ప్రమాదకరం కావచ్చు.