అమెరికాలో ప్రభుత్వం మూతపడిన పరిస్థితి (షట్‌డౌన్) కొనసాగుతూనే ఉంది. అధికార పక్షం, విపక్షాల మధ్య కీలక బిల్లులపై ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఇప్పటికే 31 రోజులుగా అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్‌డౌన్‌లో ఉంది. ప్రభుత్వ సంస్థలు, విభాగాల పనితీరు దెబ్బతిన్నాయి. ఈ స్థితి నెలరోజులకుపైగా కొనసాగుతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలింది. కాంగ్రెషనల్ బడ్జెట్ కార్యాలయం అంచనాల ప్రకారం, ఇప్పటి వరకు 7 బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ఇది భారత రూపాయల్లో సుమారు రూ.62,000 కోట్లకు సమానం.
ఈ షట్‌డౌన్ త్వరగా ముగియకపోతే ఆర్థిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని బడ్జెట్ కార్యాలయం హెచ్చరించింది. ప్రస్తుతం నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం నమోదవగా, ఈ స్థితి మరో రెండు వారాలు కొనసాగితే 11 బిలియన్ డాలర్ల వరకు, రెండు నెలలకు చేరుకుంటే 14 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు జీతాలు అందుకోలేక ఇబ్బందులు పడుతుండటం, సేవల నిలిచిపోవడం, వ్యాపార లావాదేవీలు మందగించడం వంటి కారణాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు మార్క్ జాండీ మాట్లాడుతూ — “అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలహీన స్థితిలో ఉంది. ఈ షట్‌డౌన్ కొనసాగితే పరిస్థితి ఊహించిన దానికంటే ఘోరంగా మారే ప్రమాదం ఉంది” అని అన్నారు. మరోవైపు కేపీఎంజీ సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ డయాన్ స్వాంక్ మాట్లాడుతూ — “ఈ సమస్య చిన్నదిగా కనిపించినప్పటికీ, దీని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. వ్యాపార రంగం, ఉద్యోగావకాశాలు, మార్కెట్ విశ్వాసం అన్నీ దెబ్బతింటాయి” అని హెచ్చరించారు.
గతంలో కూడా అమెరికాలో ప్రభుత్వ మూతపడిన సందర్భాలు ఉన్నాయి. 1981 నుండి ఇప్పటి వరకు 15 సార్లు ప్రభుత్వం మూతపడింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018-19 మధ్య 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగి, దేశ చరిత్రలోనే సుదీర్ఘంగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితి కూడా దాని తర్వాత రెండవ అతిపెద్ద షట్‌డౌన్‌గా మారింది. దీనివల్ల జాబ్ మార్కెట్, చిన్న వ్యాపారాలు, సేవా రంగం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు అధికార, విపక్షాలు త్వరగా ఒక నిర్ణయానికి రావాలని ప్రజలు కోరుతున్నారు.