Travel - వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద స్థానికుల భారీ ఆందోళన….
గ్రామంలోకి వెళ్లాలన్నా టోల్ కట్టాలా? గ్రామస్తుల ఆగ్రహం….
రెండుసార్లు టోల్ ఫీజు వసూలుపై వెంకటపాలెం ప్రజల నిరసన….
Amaravati Tollplaza: అమరావతిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఈరోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ గ్రామంలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ప్రతిసారి టోల్ ఫీజు చెల్లించాల్సి రావడంపై స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం గ్రామంలోకి ప్రవేశించడానికి కూడా రెండుసార్లు చార్జీలు వసూలు చేయడం అన్యాయమని పేర్కొంటూ టోల్ ప్లాజా వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బందితో కూడా మాట్లాడారు. నిత్యం ప్రయాణించే గ్రామస్తులపై ఈ ఆర్థిక భారం పడకుండా చూడాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు.
ఈ సమస్యను జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి స్థానికులకు వెసులుబాటు కల్పించేలా కృషి చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది.