మార్పుకు సిద్ధం కానివాళ్లకి గూగుల్ గుడ్‌బై సంకేతం..
AI పై ‘ఆల్ ఇన్’ గూగుల్… ఉద్యోగులకు క్లియర్ వార్నింగ్..
టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు కీలకమైన, స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత భవిష్యత్ దిశగా కంపెనీ వేగంగా ముందుకు సాగుతుండగా, ఈ మార్పులకు అనుగుణంగా పని చేయడానికి సిద్ధంగా లేని వారు స్వచ్ఛందంగా సంస్థను వీడవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (జీబీవో) విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది. మారుతున్న టెక్నాలజీ వాతావరణానికి సరిపోయేలా సంస్థ తన సిబ్బందిని పునర్‌వ్యవస్థీకరించుకుంటున్న సంకేతాలు ఇవి.
ఈ నిర్ణయాన్ని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమో ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఏఐ దిశగా దూసుకెళ్తోందని, ఈ వేగాన్ని అందుకోలేని వారు లేదా సంస్థలో కొనసాగాలనే ఆసక్తి లేని వారు ఈ వాలంటరీ ఎగ్జిట్ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. “మేము ఏఐపై పూర్తిగా నిమగ్నమయ్యే (‘ఆల్ ఇన్’) దృక్పథంతో ఉన్న బృందాన్ని కోరుకుంటున్నాం. ఆట వేగంగా మారుతోంది, పోటీ తీవ్రంగా ఉంది, పందెం చాలా పెద్దది” అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది గూగుల్ భవిష్యత్ వ్యూహంపై స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్లకు పైగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ మరియు ఏఐ విభాగాల వేగవంతమైన వృద్ధి ఈ భారీ ఆదాయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. రికార్డు లాభాలు ప్రకటించిన కొద్ది రోజులకే ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ప్రకటించడం వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ ఆధారిత సేవలు, ఉత్పత్తులపై మరింత దృష్టి పెట్టడానికి సంస్థ తన వనరులను కేంద్రీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే, ఈ వాలంటరీ ఎగ్జిట్ పథకం కంపెనీలోని అన్ని విభాగాలకు వర్తించదు. కస్టమర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు అమెరికాలోని లార్జ్ కస్టమర్ సేల్స్ వంటి కీలక విభాగాలను ఈ పథకం నుంచి మినహాయించారు. మొత్తం మీద, ఏఐ కేంద్రంగా వ్యాపారాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా గూగుల్ వేగంగా అడుగులు వేస్తోంది. మారుతున్న టెక్ ప్రపంచంలో ముందంజలో నిలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని గూగుల్ ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది.